Nayanthara: ధనుష్‌తో వివాదం, నయనతారకు కోర్టు నోటీసులు – ఆ లోపు వివరణ ఇవ్వాలని ఆదేశం

  • Written By:
  • Updated On - December 12, 2024 / 03:19 PM IST

HC Issues Notice to Nayanthara: సౌత్ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతారకు తాజాగా మద్రాస్‌ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ధనుష్‌-నయనతార వివాదం గురించి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌ తెరకెక్కించిన ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ డాక్యుమెంటరీ విషయంలో వీరి వివాదం మొదలైంది. ఈ డాక్యుమెంటరీలో ధనుష్‌ నిర్మాణంలో తెరకెక్కిన నానుమ్‌ రౌడి దాన్‌’ చిత్రంలో క్లిప్‌ను తన అనుమతి లేకుండా ఉపయోగించారని నయనతారపై కాపీ రైట్‌ కింది నోటీసులు ఇచ్చారు. ఈమేరకు రూ. 10 కోట్లు డిమాండ్‌ చేశారు. దీనిపై నయనతార స్పందించకపోవడంతో ధనుస్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించాడు.

నయనతార, ఆమె భర్త విఘ్నేష్‌ శివన్‌ పేర్లను పేర్కొంటూ వారిపై కాపీ రైట్‌ దావా వేశాడు. తాజాగా ఈ దావాపై విచారణ చేపట్టి హైకోర్టు నయన్‌ దంపతులకు నోటీసులు జారీ చేసింది. జనవరి 8వ తేదీలోగా వివరణ ఇవ్వాలని నయన్‌ దంపతులు, నెట్‌ఫ్లిక్స్‌కి కోర్టు ఆదేశించింది. నయన తార జీవితం ఆధారంగా నెట్‌ఫ్లిక్స్‌ ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించింది. ఆమె సినీ కెరీర్‌, ప్రేమ, పెళ్లికి మెయిన్‌గా ఈ డాక్యుమెంటరీ తెరకెక్కించారు. అయితే ఇందులో ధనుష్‌తో తన పరిచయం, వీరి పెళ్లిపై ఎక్కువగా ఫోకస్‌ చేశారు. ఈ క్రమంలో వీరిద్దరు తొలిసారి కలుసుకున్న ‘నానుమ్‌ రౌడిదాన్‌’ సినిమాలోని క్లిప్‌ను వాడారు. ఈ సినిమాకు విఘ్నేశ్‌ శివన్ డైరెక్టర్‌గా వ్యవహరించగా నయనతార హీరోయిన్‌గా నటించింది.

విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమాకు ధనుష్‌ నిర్మాతగా వ్యవహరించారు. తమ జీవితంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ సినిమాలోని మూడు సెకన్ల క్లిప్‌ను వాడారు. దీంతో తన అనుమతి లేకుండ ఈ క్లిప్‌ వాడారని ధనుష్‌ ఆరోపిస్తూ నయనతార, విఘ్నేష్‌లపై కాపీ రైట్‌ కింద నోటీసులు ఇచ్చాడు. దీంతో నయన్‌ ధనుష్‌ తీరును తప్పుబడుతూ లేఖ విడుదల చేసింది. ఇందులో ధనుష్‌పై తీవ్ర విమర్శలు చేసింది. ధనుష్‌ ఎదుటి వ్యక్తి ఎదిగితే ఓర్వలేడని, బయటకు చెప్పే సూక్తులను అతడు పాటించడంటూ విమర్శలు గుప్పించింది. అంతేకాదు ఈ సినిమాలోని క్లిప్‌ వాడుకునేందుకు ధనుష్‌ పర్మిషన్‌ కోసం చాలా ప్రయత్నించామని, కానీ ధనుష్‌ తమని కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని తెలిపింది.