KTR Sends Legal Notice to Bandi Sanjay: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, తనని రాజకీయంగా ఎదుర్కోలేక లీగల్ నోటీసులు పంపించారంటూ బండి సంజయ్ మండిపడ్డారు. బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. “మాజీ మంత్రి కేటీఆర్ తనకు నోటీసులు ఇచ్చినట్టు మీడియాలో చూశాను. నోటీసులతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరు. రాజకీయంగా నన్ను ఎదుర్కొలేక ఇలా నోటీసులు పంపిస్తున్న కేటీఆర్‌ను చూస్తే నాకు జాలేస్తుంది. కేటీఆర్.. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. మొదట నాపై వ్యక్తిగత ఆరోపణలు చేసింది కేటీఆరే.. వాటికి బదులుగా నేను మాట్లాడాను. కేటీఆర్ సుద్దపూప అనుకుంటున్నారేమో.. ఆయన బాగోతం ప్రజలందరికి తెలుసు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహరంలో ఏం జరిగింది.. ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో అందరికి తెలుసు. కేటీఆర్ నోటీసులకు, నోటీసులతోనే జావాబిస్తా” అని ఆయన పేర్కొన్నారు.
కాగా ఇటీవల ప్రెస్ మీట్‌లో బండి సంజయ్, తనపై చేసిన వ్యాఖ్యలకు గానూ కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. తనపై చేసిన నిరాధారమైన ఆరోపణలకు వారంలోగా ఆయన బేషరతుగా క్షమాపణలు చేప్పాలని, లేదని లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు. తాను డ్రగ్స్ తీసుకుంటానంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు.. తను పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే బీఆర్‌ఎస్ పాలనలో తాను ట్యాపింగ్‌కు పాల్పడ్డానంటూ బండి సంజయ్ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ పేరును కూడా ప్రస్తావించారని, బండి సంజయ్ కామెంట్స్ తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని కేటీఆర్ తన నోటీసులో పేర్కొన్నారు.