Jeevitha Rajashekar : ప్రముఖ నటీనటులు జీవిత, రాజశేఖర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. అయితే తాజాగా వీరికి పరువు నష్టం కేసులో కోర్టు ఊహించని షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. జీవిత, రాజశేఖర్ కు నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. 2011లో మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై జీవిత, రాజశేఖర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అమ్ముకుంటోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అప్పట్లో కలకలం సృష్టించింది. ఈ వ్యాఖ్యల పట్ల సినీ నిర్మాత, చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్ పరువు నష్టం దావా వేశారు.
ప్రజల కొరకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిరంజీవి.. రక్తదానం కోసం ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ పై అసత్య ఆరోపణలు చేశారని అల్లు అరవింద్ పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన అనంతరం జీవిత, రాజశేఖర్ దంపతులకు జైలు శిక్ష విధిస్తూ నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ (ఏసీఎంఎం) కోర్టు తీర్పు వెలువరించింది. జీవిత, రాజశేఖర్ కు ఏడాది జైలు శిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధించింది. అనంతరం అప్పీల్ కు వెళ్లేందుకు సమయం ఇస్తూ వారికి బెయిల్ మంజూరు చేసింది.
జీవిత, రాజశేఖర్ 2011లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై సంచలన ఆరోపణలు చేశారు. చిరంజీవి నిర్వహించే బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. ఇక వారి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న సినీ నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు. వారు చేసిన ఆరోపణలకు సంబంధించిన మీడియాలో వచ్చిన కథనాలను సీడీ రూపంలో కోర్టుకు సమర్పించారు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుపై జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడంతో జరిమానా చెల్లించిన వారిద్దరి నుంచి పూచీకత్తులను సమర్పించి బెయిల్ తీసుకుని విడుదల అయ్యారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.