CM Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో డిల్లీ వెళ్ళిన సీఎం జగన్ రాత్రి 7.30 గంటల సమయానికి ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఈ టూర్‌లో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా లతో పాటు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ భేటీ కానున్నట్టు సమాచారం అందుతుంది.
రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిల గురించి ప్రధాని మోదీతో.. జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై వినతి పత్రాలను కేంద్ర మంత్రులకు జగన్ ఇస్తారని భావిస్తున్నారు. జులైలో విశాఖ నుంచి పరిపాలన చేస్తామని ఇప్పటికే కేబినెట్ భేటీలో జగన్ మంత్రులకు స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాజధాని ప్రధాన అంశంగా సీఎం ఢిల్లీ టూర్ ఉంటుందన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని కేంద్ర పెద్దలతో సీఎం చర్చిం చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరి జగన్ ఢిల్లీ పెద్దలతో ఏ అంశాలపై చర్చించారో తెలియాలంటే ఈరోజు సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.
ఇక మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఎంపీ శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులుకి కూడా ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. శనివారం (మార్చి 18,2023) ఉదయం 11గంటలకు విచారణకు రావాలని ఆదేశించారు. ఈ మేరకు ఇప్పుడు జగన్ డిల్లీ వెళ్ళడం వెనుక ఆంతర్యం ఏమిటా అని అంతా ఆలోచిస్తున్నారు.
అలానే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 9 స్థానాలనూ కైవసం చేసుకుంది. వీటిలో 5 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు జరిగిన మిగతా 4 స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ నాలుగు స్థానాలకు ఈనెల 13న పోలింగ్ జరిగింది.