India vs Barbados: కామన్వెల్త్ మహిళా క్రికెట్ కీలక మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బార్బడోస్‌ను చిత్తుగా ఓడించి గ్రూప్-A నుంచి సెమీస్‌కు దూసుకెళ్లింది. బ్యాటింగ్‌లో రోడ్రిగ్స్ 56 పరుగులతో నాటౌట్, బౌలింగ్‌లో రేణుకా సింగ్ 4 వికెట్లతో విజృంభించిన వేళ భారత్ 100 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. బార్బడోస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 62 పరుగులు మాత్రమే చేసింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టుకు ఆరంభంలో షాక్ తగిలింది. షకెరా సెల్మాన్ వేసిన రెండో ఓవర్లో ఓపెనర్ స్మృతీ మంధాన 5 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరింది. ఆపై షఫాలీ వర్మ 43, రోడ్రిగ్స్ 56 దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ కలిసి 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 9 ఓవర్లో షఫాలీ రనౌట్ కాగా, ఆ వెంటనే వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ డకౌట్ అయింది. ఆ తర్వాత తానియా 6 పరుగులతో కూడా నిరాశపరచగా, రోడ్రిగ్స్‌తో కలిసి దీప్తి శర్మ 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
163 పరుగుల లక్ష్యఛేదనలో బార్బడోస్ బ్యాటర్లు చతికిలపడ్డారు. ఆది నుంచి భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ఆ జట్టును కోలుకోలేని దెబ్బతీశారు. టీమిండియా బౌలర్లలో రేణుకా సింగ్ 4 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేయగా, మేఘ్నా సింగ్, స్నేహ రాణా, రాధా యాదవ్, హర్మన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. బార్బడోస్ బ్యాటర్లలో కైషోనా నైట్ 16 టాస్ స్కోరర్‌గా నిలిచింది.