Telangana Rains : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఆకాశానికి చిల్లు పడిందా అనే అనే అనుమానం వస్తుంది. గత మూడు రోజులుగా ఏపీ తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి ముఖ్యంగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోలీస్ శాఖ అప్రమత్తమయ్యింది. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం అతిభారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ ప్రజలకు కొన్ని జాగ్రత్తలు సూచించారు.
అత్యంత భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్లనుండి బయటకు రావద్దని.. రాత్రుళ్లు ప్రయాణాలు పెట్టుకోవద్దని డిజిపి సూచించారు. (Telangana Rains) వరదల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు హోంగార్డ్ నుండి డిజి స్థాయి అధికారుల వరకు సిద్దంగా వున్నారని డిజిపి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ప్రతి గంటలకోసారి సమాచారం సేకరిస్తున్నామని అన్నారు. ఈ రిపోర్ట్ ఆధారంగా ఎక్కడయినా ప్రమాదకర పరిస్థితులు వుంటే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు, రాష్ట్ర యంత్రాగాన్ని అప్రమత్తం చేస్తున్నట్లు డిజిపి తెలిపారు.
హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో పరిస్థితి మెరుగ్గానే వుందని… కొన్ని లోతట్టు ప్రాంతాలు మాత్రం వరదనీటిలో చిక్కుకున్నాయని డిజిపి తెలిపారు. మూసీ నది ప్రవాహం పెరిగిందని… పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. మూసారాంబాగ్ బ్రిడ్జి పైనుండి ప్రస్తుతానికి రాకపోకలు కొనసాగుతున్నాయని తెలిపారు. బ్రిడ్జి పైకి నీరు చేరితే రాకపోకలు నిలిపివేస్తామని డిజిపి తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్.పి లు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కంట్రోల్ రూమ్ లో ప్రత్యేకంగా ముగ్గురు సీనియర్ అధికారులును నియమించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. (Telangana Rains) కంట్రోల్ రూమ్ లో 7997950008 , 7997959782, 040 – 23450779 అనే నెంబర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అదే విధంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. కొత్తగూడెం, హైదరాబాద్ లలో రెండు చొప్పున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ములుగు, వరంగల్ లో ఒక్కొక్క బృందం ఉందని తెలిపారు.