Train Accident : ఒడిశా రాష్ట్రంలో జరిగిన ఘోర రైలు ప్రమాదాన్ని ప్రజలు ఇంకా మర్చిపోనేలేదు. మూడు రైళ్లు ఢీకొని 283 మంది మరణించిన దుర్ఘటన జరిగిన ఈ నెల రోజుల వ్యవధి లోనే వరుసగా రైలు ప్రమాదాలు జరగడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. కాగా ఇప్పుడు తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా రైల్వేస్టేషన్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు రెండు గూడ్స్ రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనతో 12కిపైగా వ్యాగన్లు పట్టాలు తప్పగా.. గూడ్స్ రైలు ఇంజిన్.. మరో రైలు వ్యాగన్ పైకి చేరింది. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఓ రైలు డ్రైవర్ కి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తుంది.
ప్రమాదం (Train Accident) ఎలా జరిగిందంటే..?
తెల్లవారుజామున 4.05 గంటల సమయంలో ఓండా స్టేషన్ వద్ద రైల్వే మెయింటెనెన్స్ రైలు (బీఆర్‌ఎన్) షంటింగ్ పని జరుగుతోంది. ఆ సమయంలో గూడ్స్ రైలుకు రెడ్ సిగ్నల్ పడింది. కానీ, గూడ్స్ రైలు ఆగకుండా ముందుకు వెళ్లిపోయింది. ఆ తర్వాత బీఆర్‌ఎన్ మెయింటెనెన్స్ రైలును ఢీకొంది. దీంతో 12 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఉదయం 7 గంటల సమయానికి అప్ మెయిల్, అప్ లూప్ లైన్లను పునరుద్ధరించారు. ఈ విషయాన్ని ఆగ్నేయ రైల్వే సీపీఆర్‌వో వెల్లడించారు. ఈ ప్రమాదంతో 14 రైళ్లను ఈరోజు రద్దు చేసినట్లు ఆగ్నేయ రైల్వే ప్రకటించింది. కాగా మరికొన్ని రైళ్లను దారి మళ్లించామని తెలిపింది. ఈ మేరకు ఆ వివరాలను ట్విటర్ ద్వారా వెల్లడించింది.