Fatigue: మానసిక శ్రమ ఎక్కువైనా.. శరీరం విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల అలసట అనే భావన కలుగుతుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా వెంటనే అలసట వస్తుంది. అయితే శరీరం త్వరగా అలసటకు గురి కాకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన అలవాట్లను ఫాలో అయితే సరిపోతుంది అంటున్నారు నిపుణులు.
తగినంత నీరు
శరీరం అలసట నుంచి బయటపడాలంటే తగినంత నీరు తాగాలి. దీనివల్ల శరీరంలో రక్తప్రసరణ పెరిగి, మెదడు చురుకుగా పనిచేస్తుంది. రోజులో కనీసం 8 గ్లాసుల నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.
దాహం వేస్తేనే అని కాకుండా.. రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగుతూ ఉండాలి.
సమయం లేదని చాలామంది ఉదయం పూట టిఫిన్ మానేస్తుంటారు. అయితే, టిఫిన్ తినకపోవడం వల్ల త్వరగా అలసిపోతాము. ముందురోజు రాత్రి ఎప్పుడో భోజనం చేసి ఉంటాము. టిఫిన్ తినకుండా.. డైరెక్ట్ మధ్యాహ్నం లంచ్ చేస్తాము.
దీనివల్ల దాదాపు 16 నుంచి 17 గంటలు ఏ ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం శక్తి హీనం అవుతుంది. దీనివల్ల అలసట ఏర్పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉదయం టిఫిన్ మానకూడదు.
అనవసర ఉపవాసాలొద్దు)(Fatigue)
మధ్యాహ్నం చేసే భోజనంలో తప్పకుండా కార్బొహైడ్రేట్లు , ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి.
దీనివల్ల శరీరం చురుకుగా ఉంటుంది. అనవసర, అసందర్భ ఉపవాసాలు చేయడం కూడా శరీరానికి మంచిది కాదు.
ఏ వారానికో, పదిరోజులకో ఉపవాసం ఉంటే మంచిది. కానీ, కొంతమంది వారానికి రెండు మూడు రోజులు ఉపవాసం చేస్తుంటారు. దాని వల్ల శరీరం శుష్కించి పోయే ప్రమాదం ఉంది.
ఒక్కోసారి ఎక్కువగా తినడం కూడా అలసటకు కారణం. ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తినడం వల్ల కొవ్వు పేరుకుపోయి.. చురకుతనం తగ్గి.. ఆయాసం, అలసట ఆవహిస్తాయి.
తాజా ఆకుకూరలు
రోజూ వారీ తీసుకునే ఆహారంలో ఐరన్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఐరన్ లోపం వల్ల.. రక్తహీనత వస్తుంది. ఆ రక్తహీనత అలసటకు దారి తీస్తుంది. చురకుతనం తగ్గుతుంది.
అందుకే ఇనుము ఎక్కువగా ఉండి, సులభంగా దొరికే అన్ని రకాల తాజా ఆకుకూరలు అంటే తోటకూర, గోంగూర, పాలకూర, మెంతి కూర లాంటివి రోజూ తీసుకోవడం వల్ల
రక్తహీనతకు దూరంగా ఉండొచ్చు.
విటమిన్-సి ఎక్కువగా ఉండే ఆహారాలను రోజువారీ ఆహారంలో తింటున్నా.. అలసట దరి చేరదు. యాక్టివ్‌గా కూడా ఉంటారు.
కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ ను వీలైనంత వరకు తక్కువగా తీసుకోవాలి.
అవి ఎక్కువగా తీసుకున్నా అలసట, ఆందోళన, చిరాకు పెరుగుతాయి. ఆహారంలో పెరుగును భాగంగా చేసుకోవాల్సిందే.
ఎందుకంటే పెరుగు శరీరానికి కొత్త శక్తినిస్తుంది. అలసట నుంచి దూరం చేస్తుంది.
ఈ అలవాట్లకు దూరంగా
నిద్రకు ఆటంకాలు, ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం లేకపోవడం, ఆల్కహాల్ లేదా డ్రగ్స్ వాడకం మరియు ఇతర కారకాలు అలసటకు కారణమవుతాయి.
గుండె మరియు ఊపిరితిత్తుల పరిస్థితులు రక్త ప్రవాహాన్ని దెబ్బతీస్తాయి, మంటను కలిగించడంతో పాటు అలసట వస్తుంది.
అలసటను ముందుగానే గుర్తించడం వల్ల రాబోయే ఆరోగ్య పరమైన సమస్యలను సులభంగా అధిగమించవచ్చు అనేది నిపుణుల మాట.