New Delhi: భారతదేశ 15వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీ, అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ పోలింగ్ జరగనుంది. పార్లమెంటులో లోక్ సభ, రాజ్యసభ సభ్యులు మొత్తం 776 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4వేల 33 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనున్నారు.
ఈసారి రాష్ట్రపతి ఎన్నికల రేసులో ఇద్దరు అభ్యర్థులు మాత్రమే మిగిలారు. ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలు ఈ నెల 21న వెలువడనున్నాయి. భారత నూతన రాష్ట్రపతి ఈ నెల 25న ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. ఈ ఎన్నికల కోసం పార్లమెంటు సహా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబీల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎంపీ ఓటు విలువ 700గా ఉంది.
ఇక ఎమ్మెల్యే ఓటు విలువను 1971 నాటి జనగణన ఆధారంగా నిర్ణయించారు. ఎమ్మెల్యే ఓటు విలువను ఎలా లెక్కిస్తారంటే, ఓ రాష్ట్రంలోని అసెంబ్లీలో ఉన్న మొత్తం సీట్లను వెయ్యితో గుణిస్తారు. వచ్చిన సంఖ్యతో 1971లో ఆ రాష్ట్రంలో ఉన్న జనాభాను భాగించాలి. ఆ వచ్చిన సంఖ్య ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ అవుతుంది. 1971లో భారతదేశ జనాభా 54.93 కోట్లు కాగా, ఎమ్మెల్యేల ఓటు విలువ కనుగొనడానికి 2026 వరకు దీన్నే ప్రాతిపదికగా తీసుకోనున్నారు.