Anna Canteen: అన్నం పరబ్రహ్మ స్వరూపం మాటలకు తెలుగుదేశం శ్రేణులు కట్టుబడ్డారు. ఏపీ ప్రభుత్వం అన్న క్యాంటిన్ నిర్వహణపై చేతులెత్తేయడంతో తెదేపా కార్యకర్తలే పేదలకు, ప్రజలకు అన్నం అందించేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. దీంతో ఏకంగా అన్న క్యాంటిన్ నిర్వహణపై వైకాపా శ్రేణులు పెద్ద విధ్వంసానికి పాల్పడిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా అన్న క్యాంటిన్ ద్వారా పేదలకు అన్నం పెట్టాలంటూ ఓ రైతు సోదర కుటుంబం ఏకంగా 5 ఎకరాల వరి పంటను తెదేపా మాజీ మంత్రికి అప్పగించి ఆకలి తీర్చేవారే అన్నదాతలు అనుకొనేలా అందరి మన్ననలు పొందిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకొనింది.
వివరాల్లోకి వెళ్లితే.. మైలవరం, రెడ్డి గుంటకు చెందిన చేబ్రోలు నాగేశ్వరరావు సోదరులు తమ పొలంలో పండిన ధాన్యాన్ని అన్న క్యాంటిన్ నిర్వహణకు ఇచ్చేందుకు సిద్దమైనారు. తమ పొలంలో పండిన 5ఎకరాల ధాన్యం దిగుబడిని తెదేపా మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వర రావుకు అందచేశారు. వీటి బరువు దాదాపుగా 13వేల కిలోల ధాన్యంగా ఉండనుంది. వాటిని మర ఆడిస్తే సుమారు 6500కెజీల బియ్యం గింజలు రానున్నాయి. పది మందికి అన్నం పెట్టేందుకు వారు పంట దిగుబడిని ఈ విధంగా అన్న క్యాంటిన్ నిర్వహణ కొరకు ఉచితంగా అందచేశారు. పంట సమయంలో వారు పిచికారీ కూడా చల్లి మంచి దిగుబడి రావాలంటూ కోరుకున్నారు.
ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ పేదవాడికి భోజనం పెట్టేందుకు తెదేపా శ్రేణులు ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వెయ్యి నుండి లక్ష రూపాయల వరకు విరాళంగా ఇస్తూ అన్న క్యాంటిన్ నిర్వహణలో భాగస్వాములుగా మారడం ఎంతో ఆనందం ఇస్తుందన్నారు. ధాన్యం ఇచ్చిన చేబ్రోలు సోదరులకు అభినందనలు తెలిపారు. ఆర్గానిక్ పద్దతిలో సేంద్రీయ ఎరువులతో దిగుబడి చేసిన ధాన్యాన్ని అన్నం పెట్టేందుకు ఇవ్వడం ఎంతో గొప్ప విషయంగా పేర్కొన్నారు.
గడిచిన 82 రోజులుగా మైలవరం నియోజకవర్గంలో అన్నక్యాంటిన్ నిర్వహణకు తెదేపా కార్యకర్తలు, నేతలు తమ వంతు సహకారం ఇవ్వడం ఆదర్శనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఆదర్శంగా తీసుకొని అన్న క్యాంటిన్ నిర్వహణలకు ఆయా ప్రాంతాల్లోని పేదలకు పట్టెడు భోజనం పెట్టేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. పేదవాడి కోసం అన్నదాన స్పూర్తికి చంద్రబాబు నడుం బిగించడం ఎంతో ప్రయోజనకరంగా మారిందని కితాబులిచ్చారు.
ఇది కూడా చదవండి: ప్రత్తి తెగుళ్ళను నివారించే పద్దతుల గురించి తెలుసుకుందాం !