Deputy CM Pawan Kalyan: రాయలసీమకు పునర్ వైభవం తీసుకొస్తాం.. తాగునీటికి ఇబ్బంది రాకూడదనేదే ప్రభుత్వ లక్ష్యం

Deputy CM Pawan Kalyan Visits Kadapa: మహనీయుల నేలకు తానొచ్చానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శనివారం కడప మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు. ఆటల విషయంలో బాయ్స్ కి ఎక్కువ సపోర్టర్ చేస్తున్నారని పవన్ కు ఓ బాలిక ఫిర్యాదు చేసింది. పిల్లల పట్ల అటువంటి వైరుధ్యం ఎందుకని పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు. ఈ విషయంపై టీచర్ ను ఆరా తీశారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. విలువలతో కూడిన విద్యనందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను మరువొద్దన్నారు. పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు తన వంతు సాకారం అందిస్తానని హామీనిచ్చారు.

విద్యార్థుల భవిష్యత్ కోసం పనిచేస్తాం..
సమాజానికి సరైన చదువు అందించకుంటే అభివృద్ధి దిశగా వెళ్లడం కష్టమేనని పవన్ చెప్పారు. విద్యార్థుల భవిష్యత్ కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పిల్లలతో చర్చిస్తేనే అన్ని విషయాలు మనకు తెలుస్తాయన్నారు. ఇటీవల విద్యార్థులు తిరగబడి టీచర్‌పై దాడి చేసిన ఘటన చూశామని, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా బాధ్యతగా ఉండాలని కోరారు. ఎక్కడ తప్పు జరిగినా ముందుగానే చర్చించుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు చర్చలు జరగాల్సిన అవసరం ఉందని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

చదువుల నేల రాయలసీమ…
చదువుల నేల రాయలసీమ అని పవన్ అన్నారు. అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతమని ఆయన పేర్కొన్నారు. రాయలసీమలో అన్నమయ్య, వేమన, పుట్టపర్తి నారాయణ చార్యులు, కేవీ రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి మహనీయులు పుట్టారని గుర్తుచేశారు. అలాంటి ప్రాంతం అభివృద్ధి వెనకబాటుకాదని చెప్పారు. రాయలసీమకు పునర్ వైభవం తీసుకువస్తామన్నారు. అవకాశాలకు ముందుండి నడిచే ప్రాంతం రాయలసీమ కావాలని ఆకాంక్షించారు.

నీటి సమస్య తీర్చుతా…
2014-19 సంవత్సరంలో ఉద్దానం సమస్యను బయటకు తీసుకొచ్చామని పవన్ అన్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో దాదాపు రూ.61 కోట్లు ఖర్చు చేసి ఉద్దానం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. కడపలో ఇంత నీటి సమస్య ఉందని అనుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ప్రాంతం నుంచి ఇద్దరు సీఎంలు అయినందున సమస్యలు తీరిపోయి ఉంటాయని అనుకున్నా కానీ ఇప్పటికీ నీటి సమస్య తీరలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పులివెందుల తాగునీటి ప్రాజెక్టుకు రూ.45 కోట్లు ఇచ్చామని గుర్తుచేశారు. తాగునీటి కోసం ఎక్కడా ఇబ్బంది రాకూడదనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకే భవిష్యత్తులోనూ నీటి సమస్య రాకుండా ఇక్కడి ప్రజలను ఆదుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

నన్ను పిఠాపురానికే పరిమితం చేస్తారు..
నన్ను పిఠాపురానికే పరిమితం చేస్తారని, కానీ నేను సరస్వతీకి నిలయమైన రాయలసీమను ఎంచుకున్నానని చెప్పారు. గత ప్రభుత్వం చేపట్టిన పథకాలు, పనులను కొనసాగిస్తున్నామని తెలిపారు. సమాజానికి సరైన విద్యను అందించకపోతే అభివృద్ధి సూచికలోకి రాదని, విద్యార్థుల భద్రత మాదకద్రవ్యాల వినియోగం సోషల్ మీడియా ప్రభావం విద్యార్థులపై పడుతోందన్నారు. ఐపాడ్ ఇచ్చింది చదువుకు ఉపయోగపడాలని, వాటిని వేరే వాటికి ఉపయోగించడం బాధ్యతారాహిత్యమన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు దీనికి బాధ్యత వహించాలని కోరారు. రాయచోటిలో విద్యార్థులు గొడవపడుతుంటే మందలించిన ఉపాధ్యాయుడు మృతిచెందాడని గుర్తుచేశారు.

పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి
చదువు, ఉద్యోగం కోసమే కాదు జ్ఞానం సంపాదించుకోవడానికే అన్నారు. మనం భారతీయులమని మరిచిపోకూడదని సూచించారు. ప్రీతి అనే బాలిక పాఠశాలకు వెళ్లి తరగతి గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని మృతి చెందిందని, ఇటువంటి ఘటనలను కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుందన్నారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన టాబ్స్ ను అవసరానికి వాడుతున్నారా లేక అవసరానికి మించి వాడుతున్నారా అనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాన్నారు. ప్రభుత్వ పాఠశాలలు బలపడాలని ఆకాక్షించారు. కేంద్ర ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించి ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలను దీటుగా అభివృద్ధి చేయాలన్నారు. విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు అన్ని అంశాలపై సమగ్ర అవగాహన ఉండాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం గురించి కేబినెట్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. పౌష్టికాహారం అందక పిల్లల దేహదారుఢ్యం సరిగా లేదన్నారు.

విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలి..
విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పవన్ కోరారు. తల్లిదండ్రులు బాధ్యతతో వ్యవహరించాలన్నారు. 16 ఏళ్లు వచ్చేవరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. అధ్యాపకులు తనకు చాలా గౌరవమన్నారు. ఇంట్లోని ఇద్దరు, ముగ్గురు పిల్లలను తల్లిదండ్రులు చూసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారని, అయినా వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. దేశం బాగుపడాలంటే కాంట్రాక్టర్లకు కాదు.. ఉపాధ్యాయులకు పెట్టుబడులు పెట్టాలని తెలిపారు. విలువలతో కూడిన అధ్యాపకులు ఉంటే దేశం ఎంతో ముందుకెళ్తుందని ఆకాక్షించారు.

కడప జిల్లాకు హామీలు
కడప మున్సిపల్ ప్రభుత్వ స్కూల్‌ కిచెన్‌ ఆధునీకరణకు తన సొంత నిధులు ఇస్తానని డిప్యూటీ సీఎం పవన్ ప్రకటించారు. విద్యార్థినుల ఆటలకు అవసరమైన నిధులను తానే సమకూరుస్తానని హామీ ఇచ్చారు. ‘నా నిజమైన హీరో టీచరే.. స్కూల్స్‌ను ఇతర కార్యక్రమాలకు వాడినా.. కబ్జా చేసినా కేసులు పెడతాం.. రాయలసీమ తెగింపుల నేల.. ఆడపిల్లలను ఏడిపిస్తే సహించను.. రాయలసీమ అంటే వెనుకబడిన ప్రాంతం కాదు.. సాహిత్యానికి నిలయం’అని పవన్ అన్నారు.