Pawan Kalyan: సీఎంతో పవన్‌ భేటీ – కాకినాడ అంశంపై కీలక నిర్ణయాలు

  • Written By:
  • Updated On - December 3, 2024 / 10:18 PM IST

Pawan Kalyan Meets Chandrababu Naidu: కాకినాడ పోర్టు కేంద్రంగా వైసీపీ హయాంలో సాగిన అక్రమ రేషన్ దందా నేటికీ కొనసాగుతూనే ఉందని, ఈ విషయంలో ప్రభుత్వం లోతైన విచారణ చేపట్టి, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని జనసేనాని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిని కోరారు. సోమవారం ఆయన ఉండవల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. కాగా ఇటీవల సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మరణంపై జనసేనాని విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. అనంతరం వారిద్దరూ రెండు గంటల పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు.

కోరలు పీకాల్సిందే..

కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై సమగ్ర విచారణకు ఆదేశించాలని సీఎంను పవన్ కోరారు. గత ఐదేళ్లలో బియ్యం మాఫియా చెలరేగిపోయిందని, దేశ భద్రతకు సైతం ముప్పు వాటిల్లేలా ఈ స్మగ్లింగ్‌ సాగిందని సీఎంకు పవన్‌ కళ్యాణ్‌ వివరించారు. ఈ దంతా అంతా కాకినాడ కేంద్రంగా సాగిందని స్పష్టం చేశారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఒక పెద్ద నెట్ వర్క్ ఏర్పాటు చేశామని, అది గత మూడేళ్లలో కాకినాడ పోర్టు నుంచే రూ.48,537 కోట్ల విలువ చేసే బియ్యం విదేశాలకు ఎగుమతి చేశారని గుర్తించినట్టు చెప్పారు. ఈ మాఫియాకు కళ్లెం వేసే దిశగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని పవన్‌ సీఎంకు విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్లలో కాకినాడ పోర్టులోకి ఎవరినీ అనుమతించలేదని, తన పర్యటన సమయంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన గుర్తు చేశారు. సమగ్ర విచారణ ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలిసేలా చేయాలని కోరారు. కాగ,ా దీనిపై ఒక విచారణ కమిటీని నియమించి , ఆ నివేదిక రాగానే బాధ్యుల మీద చర్యలు తీసుకుందామని సీఎం ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

రాజ్యసభ ఎన్నికపై..

ఏపీలోని మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కావటం, మంగళవారం నుంచి వీటికి నామినేషన్లు ప్రారంభం కావటంతో ఈ అంశంపైనా ఇరువురు నేతలూ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రతిపాదనను ముఖ్యమంత్రి.. జనసేనానికి వివరించినట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఆర్‌.కృష్ణయ్య, టీడీపీ నుంచి బీద మస్తాన్‌కు సీటు ఖారారు అయినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ మూడవ సీటుపై ఉభయులు చర్చించినట్లు తెలుస్తోంది.

నామినేటెడ్ పోస్టులపై..

నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ త్వరలో నాలుగో జాబితా విడుదలపై కసరత్తు చేస్తున్నారు. అందులోభాగంగా పలువురి పేర్లు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. మూడు జాబితాల విషయంలో ఎటువంటి వివాదాలకు తావు లేకపోవడంతో నాలుగో జాబితాలో సైతం కష్టపడి పని చేసిన వారికే పదవులు కేటాయించాలని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మరో 15 రోజుల్లో నాలుగో జాబితాను విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

క్యాబినెట్ భేటీపై..

మంగళవారం నాటి క్యాబినెట్ భేటీ మీద కూడా చంద్రబాబు, పవన్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అజెండా మీద వీరిద్దరూ కొంత కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో కీలకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో బాటు కొన్ని ఇతర హామీలను ఈసారి ఆమోదించి, సంక్రాంతి నాటికి అమల్లోకి తేవాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్న వేళ.. నేటి భేటీలో ఈ చర్చ కూడా జరిగిందని భావిస్తున్నారు.

అవీ.. ఇవీ..
ఇటీవల తాను జరిపిన ఢిల్లీ పర్యటన, అందులో భాగంగా ప్రధాని, పలువురు కేంద్ర మంత్రులతో తన చర్చల సారాంశాన్ని పవన్ క్లుప్తంగా సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, సోషల్ మీడియా కేసులపైనా ఇరువురు నేతలూ చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.