Cyberabad Police : తెలంగాణలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజల పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. మరో మూడ్రోజుల పాటు ఇలాగే భారీగానే వర్షాలు కురుస్తాయని శాఖ తెలిపింది. ఇక హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు.. హైదరాబాద్‌లో పగలు రాత్రి తేడా లేకుండా వాన కురుస్తూనే ఉంది. వర్షాకాలంలో వాహనదారుల అవస్థలు చెప్పతరం కాదు. ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు వర్షం దాటికి మొరాయిస్తూ ఉంటాయి.
ఒక్కోసారి సడన్ గా బైక్ లు ఆగిపోవడం మనం గమనించవచ్చు. ఆఫీస్, కాలేజీలు వగైరా పనుల నిమిత్తం బయటికి వెళ్ళి దారి మధ్యలో వాహనాలు ఆగిపోవడం వల్ల ఇబ్బంది పడే వారి కోసం సైబరాబాద్ పోలీసులు గుడ్ న్యూస్ చెప్పారు. ఇందుకోసం ఒక ప్రత్యేక ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు. వర్షానికి బండి ఆగిపోతే వెంటనే 83339 93360 నెంబర్‌కు వాట్సప్ కాల్ చేస్తే సైబరాబాద్ పోలీసులు సాయం చేస్తారు. అయితే ఇది వేలం సైబరాబాద్ కమిషనరేట్ పరిధి వరకు మాత్రమే. వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తించాలని పోలీసులు కోరారు.
ఇక వర్షాల విషయానికి వస్తే మరో రెండు రోజుల పాటు భాగ్యనగరంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలంటూ అధికారులు సూచించారు.