Ts Leaders: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ నాయకులు నోటికి పదును పెడుతున్నారు. ప్రజలను ఆకట్టుకునే క్రమంలో.. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు పాల్పడుతున్నారు. శాంతి భద్రతలు.. మత ఘర్షణలకు ఆజ్యం పోస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎంతవరకు ఫలితాలు ఇస్తాయన్నది రాష్ట్రంలో ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. నేతలు (Ts Leaders).. పదజాలం వాడడంలో అదుపు తప్పుతున్నారనే దానికి ఈ రెండు ఘటనలు నిదర్శనం.
కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. రానున్న ఎన్నికల్లో అధికారమే ఎజెండాగా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. హాత్ సే హాత్ యాత్ర పేరుతో రేవంత్ పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా పాదయాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో ఆయన మాట్లాడిన భాషపై.. చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ప్రగతి భవన్‌ను బాంబులతో మావోయిస్తులు పేల్చేయాలని మాట్లాడటం.. పెద్ద చర్చకు దారి తీసింది. ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీతో పాటు.. విపక్షాలు విమర్శలు గుప్పించాయి.
రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన పలువురు నేతలు.. ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అతనిపై పిడి చట్టం పెట్టి అరెస్టు చేయాలని నిరసన చేశారు. కార్యకర్తలను ఉత్సాహపరిచే క్రమంలో.. రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్ లోకి ప్రజలను రానివ్వడం లేదని.. ప్రజాప్రతినిధులకు కూడా ప్రవేశం లేదని రేవంత్ అన్నారు. అలాంటి ప్రగతి భవన్ ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే అంటూ ప్రశ్నించారు. రైతులను పట్టించుకోని సీఎం మనకు అవసరమా.. అలాంటి ప్రగతి భవన్ ను బాంబులతో పేల్చేయాలి అంటూ రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక ఎంపీ స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని.. విశ్లేషకులు అంటున్నారు.
ఇచ్చిన హామీలు ప్రశ్నించకపోతే.. ప్రతిపక్ష నేతగా ప్రశ్నించాలే తప్పా.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నారు. ప్రభుత్వ భవనాన్ని పేల్చి వేస్తామని అనడం నోటి దురుసుతనానికి నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉనికిని నిలబెట్టుకోవడానికి.. ప్రజల్లో ఆదరణ పొందడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక దీనిపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
తెలంగాణ సచివాలయంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. నూతనంగా నిర్మిస్తున్న నూతన సచివాలయం డోమ్ లను కూల్చివేస్తామని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ వైపు శాసనసభా సమావేశాలు జరుగుతుండగానే.. మరోవైపు బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగనే.. నూతన సచివాలయం డోమ్‌లు కూల్చివేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తాము అధికారంలోని రాగానే నూతన సచివాలయంలో మార్పులు చేస్తామని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా మార్పులు చేస్తామని తెలిపారు. భాజపా అధికారంలోకి రాగానే కొత్త సచివాలయం డోమ్‌లను కూల్చివేస్తామని తెలిపారు. ఇక ప్రగతి భవన్ ను కూడా ప్రజా దర్బారుగా మారుస్తామని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణలో చర్చనీయాశంగా మారాయి.
కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా.. బండి సంజయ్ సవాల్ విసిరారు. రోడ్లకు అడ్డుగా ఉన్న గుళ్లు, మసీదులను కూల్చేస్తామని కేటీఆర్ అంటున్నారు. అదే కేటీఆర్ కు దమ్ముంటే.. దమ్ముంటే పాతబస్తీ నుంచే ఇది మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తెలంగాణను ఎంఐఎంకి కట్టబెట్టాలని చూస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్, ఎంఐఎం రెండు ఒక్కటే పార్టీలని.. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే.. డిపాజిట్లు రాకుండా చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.
తెలంగాణలో నిజాం రాజ్యం పోయి.. మన రాజ్యం రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. కరెంట్ ఇవ్వడం లేదని.. పొలాలు ఎండిపోతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. పాతబస్తీలో యువతకు పాస్‌పోర్టులు ఎందుకు రావడంలేదో ఎంఐఎం నేతలు ఆలోచించుకోవాలని హితవు పలికారు. దేశంలో ఎక్కడ ఎలాంటి ఘటనా జరిగినా పాతబస్తీకి చెందిన వ్యక్తులే ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు.