Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్ల జోరు

కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్ల జోరు కొనసాగుతుంది. ఐదో రోజు భారత్‌ అదరగొట్టింది. రెండు స్వర్ణాలు, రెండు రజతాలు ఖాతాలో వేసుకుంది. దీంతో భారత్ 5 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలతో మొత్తం 13 పతకాలు సాధించి పతకాల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది.

  • Written By:
  • Publish Date - August 3, 2022 / 12:48 PM IST

Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్ల జోరు కొనసాగుతుంది. ఐదో రోజు భారత్‌ అదరగొట్టింది. రెండు స్వర్ణాలు, రెండు రజతాలు ఖాతాలో వేసుకుంది. దీంతో భారత్ 5 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలతో మొత్తం 13 పతకాలు సాధించి పతకాల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 34 స్వర్ణాలు, 24 రజతాలు, 28 కాస్యాలతో మొత్తం 86 పతకాలు సాధించి తొలి స్థానంలో ఉండగా, ఇంగ్లాండ్ 27 స్వర్ణాలు, 28 రజతాలు, 17 కాంస్య పతకాలతో మొత్తం 72 పతకాలు సాధించి రెండో స్థానంలో ఉంది.

ఇక కామన్వెల్త్ క్రీడల్లో రాణిస్తున్న భారత అథ్లెట్లు మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నారు. లాన్ బౌల్స్ ఉమెన్స్ ఫోర్స్ దేశానికి స్వర్ణ పతకం అందించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో 17-10తో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. లవ్లీ చౌబే నాయకత్వంలోని రూపారాణి టిర్కీ, పింకీ, నయన‌మోనీ సైకియాతో కూడిన జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. కామన్వెల్త్ గేమ్స్‌లో ఈ విభాగంలో భారత్‌ పసిడి పతకాన్ని సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి.

మరోవైపు టేబుల్ టెన్నిస్‌లో మరో పసిడి భారత్ ఖాతాలో చేరింది. సింగపూర్‌తో జరిగిన పురుషుల టేబుల్ టెన్నిస్‌ ఫైనల్‌లో భారత జట్టు 3-1తో విజయం సాధించి ఐదో పసిడి పతకాన్ని అందించింది. ఆ వెంటనే వెయిట్‌లిఫ్టింగ్‌లో వికాస్ ఠాకూర్ 96 కేజీల ఫైనల్‌లో మొత్తంగా 346 కేజీలు ఎత్తి రజత పతకం అందుకున్నాడు. గత కామన్వెల్త్‌ క్రీడల్లో బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ స్వర్ణం గెలిచిన భారత బృందం, ఈసారి రజతంతో సరిపెట్టుకుంది. మలేసియాతో ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌1-3తో ఓటమి పాలైంది. మరోవైపు, పురుషుల లాంగ్ జంప్ ఫైనల్‌కు మురళీ శ్రీశంకర్, ముహమ్మద్ అనీస్ యహియా అర్హత సాధించారు. స్టార్ షాట్ పుట్ విభాగంలో మన్‌ప్రీత్ కౌర్ కూడా ఫైనల్‌కు అర్హత సాధించింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో మాత్రం పూనమ్ యాదవ్ నిరాశపరిచింది.