Vikarabad: సీఎం కేసీఆర్ నేడు వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నూతన సమీకృత కలెక్టరేట్‌తోపాటు టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సోమవారం సాయంత్రం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
వికారాబాద్ జిల్లాకు తొలిసారి వస్తున్న సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలకడంతోపాటు బహిరంగసభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌కు వికారాబాద్ జిల్లా పై ప్రత్యేక అభిమానం ఉన్నదని ఆమె అన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం పలు అభివృద్ది పథకాలు మంజూరు చేస్తున్నారని అన్నారు.
అనంతగిరిలో మెడికల్ కాలేజీ కోసం 30 ఎకరాల భూమి కేటాయించారని చెప్పారు. తొలి విడతలోనే జిల్లాకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను మంజూరు చేశారని మంత్రి గుర్తు చేశారు. సమీకృత కలెక్టరేట్‌కు 34 ఎకరాల భూమి కేటాయించగా 60 పాయింట్ 70కోట్లు వెచ్చించి నిర్మాణం చేపట్టామని తెలిపారు. పలు రాష్ర్టాల్లో సెక్రటేరియేట్లు సైతం మన కలెక్టరేట్ల స్థాయిలో ఉండవని చెప్పారు. తాండూరులో ఆటోనగర్, పాలిషింగ్ యూనిట్ల ఏర్పాటు, మార్కెట్‌యార్డు కోసం స్థలం కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.