Site icon Prime9

CM KCR: కర్ణాటక ప్రజలు తెలంగాణ పధకాలు కోరుతున్నారు.. సీఎం కేసీఆర్

Vikarabad: గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా కూడా పదిరోజులు తిరగకముందే రైతుభీమా కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఏ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా, ఎవరికీ లంచాలు పొందే అవకాశం లేకుండా, నేరుగా బెనిఫీషియరీ ఖాతాలో జమ అవుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం వికారాబాద్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గతంలో రైతులు నీళ్లు, కరెంటు లేక, హైదరాబాద్ వచ్చి కూలీలుగా, ఆటోరిక్షావాలాలుగా పనిచేసేవారు. కానీ ఈరోజు రైతాంగం అంతా ధీమాగా ఎకరానికి రూ.10 వేల రూపాయల పంట పెట్టుబడి సాయంగా తీసుకుంటున్నారని అన్నారు. ఇలా తీసుకుంటున్న ఒకే ఒక రైతు తెలంగాణ రైతు అని ఆయన అన్నారు. కరెంటు బాధలు పూర్తిగా పోయాయని 24 గంటలు విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా ప్రాజెక్టులు వున్న చోట సాగునీరు కూడ అందిస్తున్నామని అన్నారు.

తెలంగాణలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ పధకాలు చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు తమకు కూడ కావాలని కోరుకుంటున్నారని అన్నారు. కర్ణాటక ప్రజలు తమను తెలంగాణలో కలిపేయండి లేదా తెలంగాణలోని పథకాలను అమలు చేయాలని ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి అడుగుతున్నారని కేసీఆర్ అన్నారు.

ఒంటరి మహిళలు, వృద్ధులకు, భర్తలు చనిపోయిన ఆడవారికి గతంలో కేవలం 200 రూపాయల పెన్షన్ దక్కేదని, ఇప్పుడు రూ.2016 టంచన్‌గా ప్రతినెలా 36 లక్షల మందికి అందిస్తున్నామని కేసీఆర్ అన్నారు. 57 ఏళ్లు పైబడిన వారికి కూడా పెన్షన్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నామని, దీనితో కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేశామని కేసీఆర్ పేర్కొన్నారు.

Exit mobile version