Ragi Java in Ap Schools : ప్రభుత్వ పాఠశాలల్లో వినూత్న సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఇవాళ మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారం చేరింది. ఈ పథకంలో భాగంగా విద్యార్ధులకు ఉదయం పూట రాగి జావ అందించనున్నారు. జగనన్న గోరుముద్దలో భాగంగా వారానికి 3 రోజుల పాటు రాగి జావ అందించే కార్యక్రమం చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పథకం అమలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా 37,63,698 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కోసం ఏటా రూ. 86 కోట్ల వ్యయం అవుతుందని భావిస్తున్నారు. ఆర్థికఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినీ, విద్యార్ధులకు ఈ పథకం ద్వారా పోషకాహారం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఈరోజు తాజాగా క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. సీఎం వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. రాష్ట్రం లోని 44392 పాఠశాలల్లోని 37.63 లక్షల మంది పిల్లలకు వారంలో మూడు రోజుల పాటు రాగి జావ పంపిణీ చేయనున్నారు. విద్యార్థులకు పల్లి చిక్కీ ఇవ్వని రోజులైన మంగళ, గురు, శనివారాల్లో రాగిజావ ఇవ్వనున్నారు. రాగి జావ ద్వారా రక్తహీనత, పోషకాల లోపాలను నివారించవచ్చని ప్రభుత్వం చెబుతోంది.
జగనన్న గోరుముద్దలో భాగంగా విద్యార్థులకు అదనంగా రాగిజావ. #JaganannaGoruMudda pic.twitter.com/x2mQeq3czi
— YSR Congress Party (@YSRCParty) March 21, 2023
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిల్లల సర్వతోముఖాభివృద్ధికి చర్యలు (Ragi Java in Ap Schools)..
ఈ మేరకు సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రపంచంతో పోటీపడి నెగ్గేలా రాష్ట్రంలోని విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఇందుకోసం అనేక పథకాలను, కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. చదువుకునే పిల్లలకు శారీరక ఆరోగ్యం కోసం గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు రాగి జావను అందిస్తామని ముఖ్యమంత్రి వివరించారు.
విద్యాదీవెనతో పాటు విద్యార్థులకు వసతి దీవెన పథకాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారంగా రాగి జావను చేర్చినట్లు వివరించారు. ఒకటి నుంచి పదో తరగతి వరకున్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావను అందిస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిల్లల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు.