Heavy Rains: అలెర్ట్.. మరో మూడురోజుల పాటు భారీ వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో మూడు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

Heavy Rains: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో మూడు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మరికొన్ని చోట్ల ఇంకా వర్షం కురుస్తూనే ఉంది.

ఈ నేపథ్యంలో మరో మూడు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధికార యంత్రాంగం అలెర్ట్ అయ్యింది. ఇక కుండపోత వర్షంతో జంట నగరాలైన హైదరాబాద్ సికింద్రాబాద్‌లు అతలాకుతలం అయ్యాయి. ఎటు చూసినా రోడ్లన్నీ చెరువులను తలపించాయి. నగర జీవనం అస్తవ్యస్తంగా కనిపించింది.

రెండు గంటల్లో దాదాపు 10 సెం.మీ. వర్షం కురిసిందని చెప్పవచ్చు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తం అయ్యింది. మూసీకి వరద నీరు పోటెత్తుతుంది. చాలాచోట్ల ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. కాగా గడచిన 24 గంటల్లో నాంపల్లిలో అత్యధికంగా 9.2 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది.

ఇదీ చదవండి: మరోసారి ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా