Chennai: ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతన్ శుక్రవారం ఉదయం చెన్నైలో మరణించారు. 70 ఏళ్ల వయసున్న ఈ నటుడు చెన్నైలోని తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించారు. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో, అతను 100 చిత్రాలలో నటించి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు.
ప్రతాప్ ఆగస్టు 1952లో జన్మించాడు. ముంబై యాడ్ ఏజెన్సీలో కాపీ రైటర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. అతను దర్శకుడు భరతన్ యొక్క చిత్రం ఆరవం ద్వారా అరంగేట్రం చేశాడు. తెలుగులో ‘మరో చరిత్ర, ఆకలిరాజ్యం, డబ్బు డబ్బు డబ్బు, అమాయకుడు కాదు అసాధ్యుడు, కాంచనగంగ’ తదితర చిత్రాల్లో నటించారు. నాగార్జున నటించిన ‘చైతన్య’ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు డజనుకు పైగానే చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1985లో ప్రముఖ నటి రాధికను వివాహం చేసుకున్నారు. ప్రతాప్ పోతన్. అయితే వారి బంధం ఎంతో కాలం కొనసాగలేదు. 1986లో రాధికకు విడాకులు ఇచ్చారాయన. ఆ తర్వాత అమలా సత్యనాథ్‌ను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. 2012లో విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు కీయా అనే కుమార్తె ఉంది.
మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘CBI5: The Brain’లో ప్రతాప్ పోతన్ చివరిగా కనిపించారు. అతను చివరిగా తెలుగులో రాజ్ మాదిరాజు దర్శకత్వం వహించిన ‘గ్రే’ చిత్రంలో నటించారు.