Site icon Prime9

Hurricane Kay: అమెరికాలో బీభత్సం సృష్టించిన హరికేన్‌ ‘కే’

Waterfalls-Appear-In-Californias-Death-Valley

California: అమెరికాలో హరికేన్‌ ‘కే’ పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. హరికేన్‌ అనంతరం కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత పొడి, వేడి ప్రదేశంగా పేరుగాంచిన కాలిఫోర్నియాలోని డెత్‌వ్యాలీలో వాటర్‌వాల్స్‌కు ఇవి దారి తీశాయి. అటువంటి ప్రాంతంలో చోటుచేసుకున్న అరుదైన దృశ్యాన్ని పార్క్‌ అధికారులు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి.

ఇటీవల సంభవించిన హరికేన్‌ కే అక్కడి డెత్‌ వ్యాలీ నేషనల్‌ పార్కులో ఆకస్మిక వరదలకు కారణమయ్యింది. ఈ తుపాను ధాటికి పార్కులోని రోడ్లు, భారీ వృక్షాలు దెబ్బ తినడంతో పాటు వన్యప్రాణులకు నష్టం కలిగింది. మరోవైపు భారీ వర్షం కారణంగా బురదతో కూడిన నీరు కొండప్రాంతం నుంచి దిగువకు ప్రవహిస్తోంది. ఆ ప్రాంతంలో అత్యంత అరుదుగా సంభవించే ఇటు వంటి జలపాత దృశ్యాలను పార్కు అధికారులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రపంచంలోనే అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం అమెరికాలోని డెత్‌ వ్యాలీ. అమెరికాలోనే అత్యంత పొడి ప్రదేశమిది. ఏడాది సగటు వర్షపాతం అక్కడ కేవలం 2.2 అంగుళాలు మాత్రమే. కానీ, అటువంటి ప్రాంతంలోనూ ఇటీవల రికార్డుస్థాయి వర్షపాతం నమోదవుతోంది. ఆగస్టులో కొన్ని గంటల్లోనే 1.46 అంగుళాల వర్షపాతం నమోదుకాగా ఈ నెలలోనూ అదే పరిస్థితి. ఇలా ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలతో అత్యంత పొడి ప్రాంతంలోనూ ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. ఆగస్టు నెలలో ఈ ప్రాంతంలో వరద బీభత్సంతో రహదారులు కొట్టుకుపోవడంతోపాటు జాతీయ పార్కులో పనిచేసే సిబ్బంది, వేలాది మంది పర్యాటకులు అందులో చిక్కుకుపోయారు.

భూమ్మీదనే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంగా కాలిఫోర్నియాలోని డెత్‌ వ్యాలీ జాతీయ పార్కుకు గుర్తింపు ఉంది. అక్కడ గరిష్ఠంగా 128 డిగ్రీల ఫారన్‌హీట్‌ ఉష్ణోగ్రతలు రికార్డవుతుంటాయి. అంతర్జాతీయ వాతావరణ సంస్థల నివేదిక ప్రకారం, ఇటీవల అక్కడ 130డిగ్రీల ఫారెన్‌హీట్‌ (54.4డిగ్రీ సెల్సియస్)కుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. మొత్తానికి ఈ ఏడాది ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో అతి వృష్టి,కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి నెలకొంది. పర్యావరణ సమతూల్యం దెబ్బతినడంతో ఈ పరిస్థితి దాపురించింది. ఇప్పటికైనా ప్రపంచం మొత్తం కర్బన ఉద్గారాలను నియంత్రిస్తే తస్పు మానవాళికి మోక్షం ఉండదని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.

 

Death Valley National Park CA Tropical storm Kay hits Death Valley, flood water is flowing mountains

Exit mobile version
Skip to toolbar