TikTok India: ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ భారత్ లో తన కార్యకలాపాలను పూర్తిగా షట్ డౌన్ చేసింది. ఇండియా లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ఒకేసారి ఇంటికి పంపిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో దేశం నుంచి పనిచేస్తున్న 40 మంది ఉద్యోగులు ప్రభావితం కానున్నారు.
మూడేళ్ల తర్వాత(TikTok India)
2020 కు ముందు భారత్ లో టిక్ టాక్ ఓ వెలుగు వెలిగింది. ఎంటర్ టైన్ మెంట్ కోసం ఈ యాప్ ను అత్యధికంగా ఫాలో అయ్యేవారు. ఇండియా నుంచి టిక్ టాక్ కు 200 మిలియన్ పైగా యూజర్లు ఉన్నారంటేనే దాని క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఈ యాప్ తో ఓవర్ నైట్ స్టార్స్ అయినా వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా భారత్ లో టిక్ టాక్ ను నిషేధించారు. దీంతో ఇక్కడి నుంచి బ్రెజిల్, దుబాయ్ టిక్ టాక్ మార్కెట్ల కోసం కొంతమంది ఉద్యోగులు పనిచేస్తారు. ఇపుడు వారందరికి ఒకేసారి ఉద్వాసన పలికింది టిక్ టాక్.
భారత్ లో నిషేధం అయిన మూడేళ్ల తర్వాత బైట్ డ్యాన్స్ కు చెందిన సోషల్ మీడియా యాప్.. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరినీ సాగనంపింది. నిషేధం తర్వాత మార్కెట్ వాటా లేకపోయినప్పటికీ.. కార్యాలయాన్ని కొనసాగిస్తోంది టిక్ టాక్. ఇక ఇండియాలో తిరిగి ఎంట్రీ ఇవ్వాలనుకున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
9 నెలల జీతంతో..
ఇండియా లో పనిచేస్తున్న టిక్ టాక్ ఉద్యోగులకు ఫిబ్రవరి 28 చివరి తేదీగా ఉండనుంది. గత వారమే 40 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ లను అందించింది. లేఆఫ్స్ కు గురైన ఉద్యోగులకు 9 నెలల జీతాన్ని చెల్లిస్తామని సంస్థ పేర్కొంది. గ్లోబల్, ప్రాంతీయ సేల్స్ టీమ్స్ సపోర్ట్ కోసం 2020లో భారత్ సంస్థ సపోర్ట్ హబ్ ను ప్రారంభించింది. అయితే ఈ సపోర్ట్ హబ్ ను ప్రస్తుతం మూసి వేయాలని నిర్ణయించింది.