Telugu Vaibhavam : తెలుగు సినిమా స్థాయి గత కొన్నేళ్లల్లో ఎవరూ ఊహించని రేంజ్ లో పెరిగిపోయిందని చెప్పాలి. రీజనల్ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు గుర్తింపు తెచ్చుకోగలిగింది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా అంటే తెలియని వారు ప్రపంచంలో లేకుండా పోయారు. ఇక “ఆర్‌ఆర్‌ఆర్” సినిమా ఎన్నో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారాలను సొంతం చేసుకుంది. సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుతో పాటు మరెన్నో అవార్డులను కొల్లగొట్టిన ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది.
ఈ క్రమం లోనే ప్రపంచంలో మొట్టమొదటి సారి సిఫా అంతర్జాతీయ తెలుగు చలనచిత్ర పురస్కారాలు కెనడా లోని టొరంటో నగరం లో జరగనున్నాయి. తెలుగు వైభవం వేడుకలలో భాగంగా జరగనున్న సిఫా పురస్కారాలకు తెలుగు చలనచిత్ర నటీనటులు దర్శకనిర్మాతలు రానున్నారని సమాచారం అందుతుంది. డిసెంబర్ 15, 16, 17 తేదీలలో కెనడియన్ కన్వెన్షన్ హాల్ లో ఈ వేడుకలు భారీస్థాయిలో చేపట్టనున్నారు. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్, వంటి పలు విభాగాల్లో ఈ అవార్డులను అందజేయనున్నారు.
కాగా ఈ తెలుగు వైభవ పండుగకు తెలంగాణ ప్రభుత్వం, ఒంటారియో ప్రభుత్వం మాత్రమే కాకుండా, కెనడా లో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు కూడా వారి మద్ధతు తెలియజేసారు. చలనచిత్ర పురస్కారాలు కాకుండా మరో 20 కార్యక్రమాల సమూహమైన తెలుగు వైభవం వైపు యావత్తు ప్రవాస తెలుగు సమాజం ఆసక్తిగా చూస్తుంది.