Site icon Prime9

Pakistan: పాకిస్తాన్ ప్రజలపై రూ.17వేల కోట్ల అదనపు పన్నుల భారం

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్‌లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ప్రజలపై మోయలేని పన్నుల భారాన్ని షెహబాజ్‌ షరీఫ్ ప్రభుత్వం మోపుతోంది. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ఆర్థికమంత్రి ఇషాక్‌దార్‌ ప్రజలపై 17వేల కోట్ల రూపాయల అదనపు పన్నుల భారాన్ని మోపారు. బుధవారం నుంచి కొత్త పన్నులు అమల్లోకి వచ్చాయి. ఇక త్వరలోనే ఐఎంఎఫ్‌తో చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పాకిస్తాన్ లో అడుగంటిన విదేశీమారక నిల్వలు..(Pakistan)

పాకిస్తాన్‌ వద్ద విదేశీ మారకద్రవ్యం నిల్వలు పూర్తిగా అడుగంటాయి. కేవలం 2.9 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉన్నాయి. ఈ డాలర్లతో కేవలం రెండు వారాలకు సరిపడా దిగుమతులకు సరిపోతాయి. దీంతో పాక్‌ ప్రభుత్వం తక్షణ ఉపశమనానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా ఐఎంఎఫ్‌ వద్ద వెళ్లింది. ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఐఎంఎఫ్‌లో చర్చలు జరిపింది. 7 బిలియన్‌ డాలర్ల రుణం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికి 9 సార్లు పాక్‌తో సమీక్షలు జరిపింది. ఈ నెల ప్రారంభంలో పాకిస్తాన్‌కు వచ్చిన ఐఎంఎఫ్‌ ఆర్థికమంత్రి ఇషాక్‌ దార్‌ బృందంతో చర్చలు జరిపింది. 1.2 బిలియన్‌ డాలర్ల రుణం కావాలంటే ఐఎంఎఫ్‌ షరతులను ఆమోదించాల్సి ఉంటుంది. కాగా పాక్‌ ప్రభుత్వం ఐఎంఎఫ్‌ షరతులను అంగీకరించింది. 17వేల కోట్ల రూపాయల పన్ను విధిస్తామని హామీ ఇచ్చింది. దీంతో బుధవారం నుంచి కొత్త పన్నులు అమలు చేయడం ప్రారంభించింది.

పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు..(Pakistan)

 

ఇక పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందితే రెవెన్యూ మొదలవుతుంది. కాగా ప్రభుత్వం వద్ద ప్రత్యామ్నాయం కూడా లేదు కాబట్టి ప్రజలు ప్రభుత్వాన్ని తిట్టుకున్నా గత్యంతరం లేదు. పన్నులు పెంచాల్సి వచ్చింది. కన్సంజమ్షన్‌ టాక్స్‌ 17 నుంచి 18 శాతానికి, పొగాకుపై ఎక్సైజ్‌ సుంకంతో పాటు ఎయిర్‌ టికెట్లు,  డ్రింక్స్‌పై పెద్ద ఎత్తున పన్నులు బాదారు. దీంతో పాటు ప్రభుత్వం అడ్వాన్స్‌ టాక్స్‌తో పాటు వెడ్డింగ్‌ హాల్‌ బిల్స్‌ ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవాలనుకుంటోంది. సాధారణ అమ్మకపు పన్ను (జిఎస్‌టి)ని 17 శాతం నుంచి 18 శాతానికి పెంచాలని ఆర్థిక బిల్లు ప్రతిపాదించింది. లగ్జరీ వస్తువులపై జీఎస్టీ 17 శాతం నుంచి 25 శాతానికి పెరిగింది.పెట్రోల్‌పై లీటరుకు 22 పెంచడంతో ప్రస్తుతం లీటరు 272 రూపాయలకు చేరింది. డిజిల్‌పై 17.20 పెంచడంతో 280 రూపాయలకు ఎగబాకింది. డాలర్‌ మారకంతో పాక్‌ కరెన్సీ 265.86 పలుకుతోంది.

ఐఎంఎఫ్‌ రుణంపైనే ఆశలు..

పాకిస్తాన్‌లోని షెహబాజ్‌ ప్రభుత్వం డిఫాల్ట్‌ అవుతుందన్న భయంతో ఐఎంఎఫ్‌తో చర్చలు వేగవంతం చేసింది. ఐఎంఎఫ్‌ ఇచ్చే 1.2 బిలియన్‌ డాలర్లతో గట్టెక్కవచ్చని భావిస్తోంది. ఒక్కసారి ఐఎంఎఫ్‌ నిధులు విడుదల చేస్తే ఇప్పటి వరకు పాక్‌కు రుణాలు ఇస్తామన్న మిత్రదేశాలు.. విదేశీ బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయి. ఇక్కడ అసలు విషయానికి వస్తే పాకిస్తాన్‌ ప్రభుత్వం పరోక్ష పన్నుల ద్వారానే రెవెన్యూ సంపాదించుకోవాలనుకుంటోంది. దేశంలోని సంపన్నులపై పన్నులు మోపి రెవెన్యూ సంపాదించుకునే అవకాశం ఉన్నా ఇప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీలు మాత్రం వారివైపు కన్నెత్తి చూడ్డం లేదు.

 

48 ఏళ్ల గరిష్ఠానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం..

 

దేశంలోని సంపన్నులైన రైతులు, రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలపైన, రిటైలర్స్‌పైన పన్నులు విధించి రెవెన్యూ సంపాదించుకోవచ్చు. అయితే తక్షణమే ప్రభుత్వానికి పెద్దగా లాభం లేకపోయినా ఇప్పటి దాకా ఉన్న పన్ను వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం విధిస్తున్న పరోక్ష పన్నుల ద్వారా అతి తక్కువ ఆదాయం సంపాదించుకునే వారు బలవుతున్నారు. ప్రస్తుతం అదనంగా పన్నులు విధించడం వల్ల నెలవారి రిటైల్‌ ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకుంది. ప్రస్తుతం రిటైల్‌ ద్రవ్యోల్బణం 48 ఏళ్ల గరిష్ఠానికి 27.6 శాతానికి ఎగబాకింది. దీంతో పేదలు, దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

 

Exit mobile version