Nithyananda Kailasam : అత్యాచారం, లైంగిక వేధింపులు వంటి ఆరోపణలు ఎదుర్కొంటూ .. భారతదేశంలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడిన వ్యక్తి.. ఒక దేశాన్ని సృష్టించుకోవడం.. తనకు తానే ఆ దేశానికి అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం.. ఇప్పుడు ఏకంగా ఐక్యరాజ్యసమితి సమావేశానికి ఆ దేశం నుంచి ప్రతినిధులు పాల్గొనడం.. చివరికి తమ అధ్యక్షుడిని ఆయన పుట్టిన మాతృదేశమే వేధిస్తోందనీ.. శిక్షించాలనీ భావిస్తోందనీ ఆరోపించడం.. ప్రపంచ సమాజం జోక్యం చేసుకోవాలని ఆ సదరు ప్రతినిధులు డిమాండ్ చేయడం. చదవడానికి, వినడానికి ఈ మాటలు ఎలా ఉన్నాయో తెలీదు కానీ.. రాయడానికి మాత్రం సిగ్గు చేటుగా ఉందని చెప్పాలి.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ స్టోరీ ఎవరి గురించి రాస్తున్నామో ఇప్పటికే అర్దం అయ్యుండాలి. అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసుల్లో మన దేశ దర్యాప్తు సంస్థలు వెతుకుతున్న “నిత్యానంద స్వామి” గురించి. ఈయన గురించి యావత్ దేశం అంతా తెలిసిందే. నటి రంజితతో వీడియోలు లీక్ అయినప్పటికీ నుంచి ఈ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతూనే ఉంది. ఆ తర్వాత అత్యాచారం, అపహరణ వంటి పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందపై భారత్‌లో నాన్ బెయిలబుల్ వారెంట్ సైతం జారీ అయింది. 2019 లో భారత దేశం నుంచి పారిపోయిన నిత్యానంద.. 2020లో ఈక్వెడార్ తీరానికి దగ్గర్లోని ఓ ద్వీపాన్ని తీసుకుని దానిని కైలాస దేశంగా ప్రకటించినట్లు వార్తలొచ్చాయి.
మొదట్లో ఆ వార్తలను కొట్టిపారేసినప్పటికి కానీ, తాజా పరిణామాన్ని బట్టి కైలాస దేశం ఉత్తుత్తి దేశం కాదని, నిత్యానంద నిజంగానే ఓ దేశానికి అధినేత అని నిర్ధారణ అయింది. ఐక్యరాజ్యసమితిలో కైలాస దేశం తరఫున ప్రతినిధులు ప్రసంగించడమే అందుకు నిదర్శనంగా కనిపిస్తుంది. జెనీవాలో ఇటీవల ఐక్యరాజ్య సమితికి చెందిన సీఈఎస్ఆర్ (Committee on Economic, Social and Cultural Rights) 19వ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కైలాస దేశం తరఫున విజయప్రియ నిత్యానంద, ఈఎన్ కుమార్ ప్రతినిధులుగా హాజరయ్యారు.
USK at UN Geneva: Inputs on the Achievement of Sustainability
Participation of the United States of KAILASA in a discussion on the General Comment on Economic, Social and Cultural Rights and Sustainable Development at the United Nations in Geneva
The Economic, Social, and… pic.twitter.com/pNoAkWOas8
— KAILASA’s SPH Nithyananda (@SriNithyananda) February 25, 2023
ఈ మేరకు విజయ ప్రియ నిత్యానంద మాట్లాడుతూ.. తనను తాను ఐక్యరాజ్యసమితిలో కైలాస దేశ శాశ్వత ప్రతినిధిగా పరిచయం చేసుకున్నారు. మొదటగా కైలాస దేశ విశిష్టతను వివరించారు. కైలాస దేశం హిందువుల కోసమే ఏర్పడిన మొట్టమొదటి సార్వభౌమ దేశం అని పేర్కొన్నారు. తమ దేశాధినేత పేరు నిత్యానంద పరమశివం అని వెల్లడించారు. నిత్యానంద పరమశివం పరమావధి హిందూ మత పునరుజ్జీవం అని స్పష్టం చేశారు. అయితే తమ దేశాధినేత నిత్యానందను భారత్ వేధిస్తోందని ఐరాస వేదికగా విజయప్రియ ఆరోపించారు. నిత్యానందను శిక్షించాలనీ భారత్ భావిస్తోందని.. ప్రపంచ సమాజం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. అంతే కాకుండా తమ కైలాస దేశానికి.. 150 దేశాల్లో రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేసినట్లు చెప్పడం అందర్నీ విస్మయానికి గురి చేస్తుంది.
అయితే ఇక్కడ ప్రప్రథమంగా గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మొదట్లో అత్యాచార ఆరోపణలు రాగానే విదేశాలకు చెక్కేసిన నిత్యానంద దేశాన్ని ఏర్పాటు చేశానంటే అందరూ నవ్వుకున్నారు. ఇప్పుడు ఆ దేశానికి ‘కైలాసం’ అని పేరు పెట్టడం వరకు ఓకే. కానీ ఆ దేశానికి ఒక జెండా, రిజర్వ్ బ్యాంకు, సొంత కరెన్సీ, పాస్ పోర్టు కూడా ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు.
అసలు ఆ దేశం ఎక్కడ ఉంది.. జనాభా.. ఆ దేశ చరిత్ర.. సంస్కృతి, సాంప్రదాయాలు.. కరెన్సీ, జాతీయ జెండా.. రాజ్యాంగం.. పార్లమెంటు.. సుప్రీం కోర్టులు.. ఇవన్నీ ఉన్నాయో లేవో తెలీదు. కానీ అధ్యక్షుడు మాత్రం ఉన్నారు. అవన్నీ పక్కన పెడితే.. ఐక్యరాజ్య సమితి అనేది ప్రపంచ దేశాలన్నింటికి మధ్య శాంతి కోసం ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి చేత ఏర్పాటు చేయబడ్డ దేశాన్ని సమావేశానికి ఆహ్వానించడం పట్ల ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా షాక్ అవుతున్నాయి.
నిత్యానంద స్వామి కేసు విషయం గురించి ఇప్పుడు సామాన్య ప్రజానీకం ఎవరు ప్రశ్నించడం లేదనే అనిపిస్తుంది. కానీ.. ఒక దేశాన్ని ఏర్పాటు చేయడం ఇంత సులభమా? అత్యాచార, వేధింపుల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న వ్యక్తి దేశాన్ని సృష్టించుకొని.. దేశ అధ్యక్షుడు అవ్వడం న్యాయమా?? భారత దేశంలో ఎన్ని కేసులు ఉన్నప్పటికీ .. ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు ఉన్నప్పటికీ దేశం దాటి పోయి ఉంటే ప్రభుత్వాలు ఏమి చేయలేవా? సదరు దేశ ప్రతినిధులు కోరినట్లు నిత్యానందకు భారత్ నుంచి ఐక్యరాజ్య సమితి రక్షణ కల్పిస్తుందా..??? డబ్బులున్న బడా బాబులకు చట్టం, న్యాయం పని చేయవా?? కేవలం చట్టాలు, న్యాయలు సామాన్య ప్రజల కోసమేనా.. అని ప్రశ్నిస్తున్నారు.
దేశం నుంచి పారిపోయిన వారిలో ఒక నిత్యానంద, ఒక విజయ్ మాల్యా, ఒక నీరవ్ మోడీ.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టులో చాలా మందే ఉన్నారు. మరి ప్రస్తుతానికి అయితే ఒక దేశం వచ్చింది. త్వరలో మరెన్ని దేశాలు వస్తాయో.. వాటికి కూడా ఐక్యరాజ్య సమితి ఆహ్వానం పలుకుతుందో ?? రానున్న రోజుల్లో ఇంకెన్ని ఘోరాలను చూడాల్సి వస్తుందో అని ప్రజలంతా సిగ్గుపడుతూ.. ఆలోచించుకోవాలని తెలుపుతున్నారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/