Site icon Prime9

Russia-Ukraine war: రష్యా – ఉక్రెయిన్‌ యుద్దానికి ఏడాది పూర్తి

Russia-Ukraine war

Russia-Ukraine war

Russia-Ukraine war: రష్యా – ఉక్రెయిన్‌ యుద్దానికి సరిగ్గా శుక్రవారంతో ఏడాది గడిచిపోయింది. ఈ ఏడాది కాలంలో ఉక్రెయిన్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నిరంతరం క్షిపణిదాడులతో దేశం మొత్తం శ్మశానం అయ్యింది. లక్షలాది మంది పౌరులు సొంత ఊరును వదిలేసి పొరుగున్న ఉన్న పొలెండ్‌, స్లోవేకియా దేశాలకు తరలిపోయారు. యునైటెడ్‌ నేషన్‌లో రష్యా ఏకాకి అయ్యింది. ప్రపంచదేశాలన్ని కలిసి రష్యాను తక్షణమే యుద్ధాన్ని ఆపేయాలని కోరుతున్నాయి.

ఉక్రెయిన్‌పై రష్యా భారీ ఎత్తున దాడులకు తెగబడుతోంది. ఉక్రెయిన్‌కు తూర్పు, దక్షిణ ప్రాంతమంతా నేలమట్టమైంది. యుద్ధం మొదటివార్షికోత్సం సందర్భంగా ప్రపంచదేశాలన్ని ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచాయి. పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌పై ఉక్రెయిన్‌కు చెందిన జాతీయ జెండా నీలం.. పసుపు రంగు జెండాను రెపరెపలాడించారు. పారిస్‌ పౌరులు ఉక్రెయిన్‌ జాతీయ జెండాను తమ వంటికి కప్పుకొని మద్దతు తెలిపారు. పారిస్‌ మొత్తం ఉక్రెయిన్‌ జెండాలు రెపరెపలాడాయి. ఇక లండన్‌ విషయానికి వస్తే పలు చోట్ల ఉక్రెయిన్‌కు మద్దతుగా బ్యానర్లు వెలిశాయి. స్వేచ్చ కోసం పోరాడాలనుకునే వారు ఉక్రెయిన్‌కు అండగా నిలవాలంటూ పిలుపునిచ్చారు. యుద్దం తర్వాత మళ్లీ జీవితం ఉంటుంది. ఎందుకంటే యుద్ధంలో ఉక్రెయిన్‌ తప్పకుండా విజేత అవుతుందని పారిస్‌ మేయర్‌ ఎన్నీహిడాల్గో తన ప్రసంగంలో పేర్కొన్నారు.

గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన యుద్దాన్ని ప్రకటించిన రష్యా..(Russia-Ukraine war)

ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ విషయానికి వస్తే.. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించింది. కీవ్‌ను పూర్తిగా ఆక్రమించుకుని యూరోపియన్‌ యూనియన్‌కు అనుకూలంగా ఉన్న జెలెన్‌ స్కీ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని తన సైన్యాన్ని ఆదేశించారు. అయితే పుతిన్‌ ఆశలు అడియాశలు అయ్యాయి. పుతిన్‌ అనుకున్నదొకటి .. అయ్యిందొకటన్న చందంగా పరిస్థితులు మారిపోయాయి. ఉక్రెయిన్‌ దళాలు రష్యాను అడుగడుగునా అడ్డుకుంటున్నాయి. 2022 చివరి నుంచి ఉక్రెయిన్‌ రష్యాకు గట్టి కౌంటర్‌ ఇవ్వడం ప్రారంభించింది. తను కోల్పోయిన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌ ఐదో వంతు భాగాన్ని రష్యా తమ అదుపులో ఉంచుకుంది.

రష్యా గత ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై స్పెషల్‌ మిలిటరీ ఆపరేషన్‌ పేరుతో యుద్దం ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని రష్యా పౌరులను జెలెన్‌ స్కీ సర్కార్‌ రెండవ తరగతి పౌరులుగా చూస్తోందంటూ దండయాత్ర ప్రారంభించింది. అయితే కాలం గడిచే కొద్ది రష్యా సైనికుల్లో ముందున్నంత జోరులేదు. బాగా అలిసిపోయారు. సైనికులు బలవంతంగా యుద్దం చేయాల్సివస్తోంది. కాగా యుద్ధంలో ఇరువైపులా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించాయి. ముఖ్యంగా ఈ ఏడాది బాక్ముత్‌ పట్టణంలో యుద్ధం తారాస్థాయికి చేరింది.

ఇరువైపులా లక్షలాదిమంది సైనికుల మృతి..(Russia-Ukraine war)

ఈ యుద్ధంలో ఎంత మంది చనిపోయారనే విషయానికి వస్తే అమెరికాతో పాటు పాశ్చాత్యదేశాల అధికారుల అంచనా ప్రకారం రష్యా సైనికులు సుమారు రెండు లక్షల మంది మృతి చెందడమో లేదా గాయపడటమో జరిగిందని తేల్చి చెప్పింది. గత ఏడాది నవంబర్‌లో అమెరికాకు చెందిన జనరల్‌ ఒకరు మాట్లాడుతూ ఇరు వైపుల సుమారు లక్షల మంది సైనికులు చనిపోవడమో లేదా గాయపడ్డమో జరిగి ఉంటుందన్నారు. అయితే ఖచ్చితంగా ఎంత మంది చనిపోయారనేది మాత్రం చెప్పడం కష్టం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరోప్‌లో ఈ స్థాయిలో యుద్ధంలో మరణాలు సంభవించి ఉండవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

యుద్ధం ప్రారంభం కాగానే ఉక్రెయిన్‌కు చెందిన మిలియన్‌ల కొద్ది ప్రజలు దేశం విడిచి ఇతర దేశాలకు తరలిపోయారు. కాగా దేశంలో ఉన్న వేలాది మంది పౌరులు యుద్ధంలో చనిపోయారు. పాశ్చాత్య దేశాలతో పాటు ఉక్రెయిన్‌ కూడా రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆరోపిస్తొంది. అయితే రష్యా మాత్రం ఈ ఆరోపణలు ఖండించింది. పౌరుల జోలికి పోలేదని స్పష్టం చేస్తోంది రష్యా. ఇరు దేశాల యుద్ధం ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపించాయి. అంతర్జాతీయంగా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కాగా యుద్ధంలో ఓడిపోతే అణుబాంబులు ప్రయోగిస్తానని పుతిన్‌ హెచ్చరించడం విశేషం.ఇక ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ విషయానికి వస్తే మాస్కో వెంటనే తమ దళాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం శాంతి చర్చలు జరిగే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తమకు తెలియదని, మళ్లీ భవిష్యత్తులో ఇలాంటి యుద్ధాలు పునరావృతం కారాదనేది తమ ఉద్దేశమని నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ గురువారం నాడు రాయిటర్స్‌ వార్తా సంస్థతో మాట్లాడుతూ అన్నారు.

దాడులను పెంచిన రష్యా..(Russia-Ukraine war:)

మొదటి వార్షికోత్సవం సందర్బంగా రష్యా బాక్ముత్‌ ప్రాంతంలో దాడుల వేగం పెంచింది. గురువారం మొత్తం బాంబులతో బాక్ముత్‌ దద్దరిల్లిపోయింది. రష్యా ప్రధాన లక్ష్యంగా కూడా బాక్ముత్‌ను కైవసం చేసుకోవడం. ఒక వేళ బాక్ముత్‌ను తాము రష్యాకు అప్పగిస్తే.. ఇక ఉక్రెయిన్‌ దాదాపు చేతులు ఎత్తేయాల్సిందేనని ఉక్రెయిన్‌కు చెందిన ట్యాంక్‌ ఆపరేటర్‌ జూనియర్‌ సెర్జెంట్‌ ఓలెహా స్లావిన్‌ చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో బాక్ముత్‌ నుంచి తప్పుకొనే ప్రసక్తి లేదని ఉక్రెయిన్‌ సైనికులు వీరిచితంగా పోరాడి తమ దేశాన్ని కాపాడుకుంటామని ఉక్రెయిన్‌ సైనికులు ప్రతిజ్ఞలు చేస్తున్నారు.

రష్యా బలగాలను వెనక్కి రప్పించాలని యూఎన్ తీర్మానం..

గురువారం నాడు ఐక్యరాజ్ సమితి జనరల్‌ అసెంబ్లీలో రష్యా వెంటనే యుద్ధాన్ని ముగించేసి..తమ బలగాలను వెనక్కి రప్పించాలని తీర్మానం చేశారు. అనుకూలంగా 140 వోట్లు, 32 దేశాలు గైర్హాజరు అయ్యాయి. ఆరు దేశాలు రష్యాకు మద్దతు ప్రకటించాయి. బెలారస్‌, ఉత్తర కొరియా, ఎరిట్రా, మాలి, నికరాగ్వా, సిరియాలు రష్యాకు అండగా నిలిచాయి. యూఎన్ ఓటింగ్‌లో రష్యా మిత్రదేశం చైనా మాత్రం గైర్హాజర్‌ అయ్యింది.

యూఎన్‌లో రష్యా డిప్యూటి రాయబారి డిమిత్రి పొలియాన్‌స్కీ యునైటెడ్‌ నేషన్‌ తీర్మానం పనికిరానిదని తేల్చేశారు. కాగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జలెన్‌ స్కీ మాత్రం ఓటింగ్‌ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ పోస్టులో ప్రపంచదేశాలన్నీ ఉక్రెయిన్‌కు అండగా నిలిచినందుకు సంతోషం వ్యక్తం చేశారు. యుద్ధం ప్రారంభమై ఏడాది సమీపిస్తున్న నేపథ్యంలో రష్యా సైనికులు ఉక్రెయిన్‌కు తూర్పు, దక్షిణ ప్రాంతంలో దాడులు వేగం పెంచింది. కనీసం 25 పట్టణాలు గ్రామాలు.. రష్యా సరిహద్దున ఉండే ప్రాంతాల్లో రష్యా నిరంతరం దాడులు కొనసాగిస్తూనే ఉంది.

Exit mobile version