PM Modi: భారత ప్రధాని నరేంద్రమోదీ రెండురోజులు ఫ్రాన్స్ దేశ పర్యటన ముగించుకున్నారు. తదనంతరం మోదీ శనివారంనాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చేరారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో మోదీ అనేక అంశాలపై చర్చలు జరిపారు. ఆ దేశ పర్యటన సందర్భంగా మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆ దేశ అత్యున్నత పౌర, సైనిక గౌరవ పురస్కారం గ్రాండ్ క్రాస్ ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య సత్సంబంధాలతో కొత్త అధ్యాయానికి నాంది పలికామని మోదీ పేర్కొన్నారు. తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి భారత్, ఫ్రాన్స్ 25 ఏళ్ల రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించాయి. స్నేహపూర్వక దేశాల ప్రయోజనాలతో సహా కీలకమైన సైనిక ప్లాట్‌ఫారమ్‌ల అభివృద్ధికి అవకాశాలను అన్వేషిస్తున్నట్లు భారత్, ఫ్రాన్స్ శుక్రవారం తెలిపాయి.
అబుదాబీ పర్యటన ఎందుకంటే(PM Modi)
ఇకపోతే ‘‘భారత్-ఫ్రాన్స్ మధ్య సత్సంబంధాలకు బాటవేటిన మోదీ తదుపరి పర్యటన కోసం ఇప్పుడు అబుదాబికి బయలుదేరారు’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. అబుదాబీలో ఆహార భద్రత, రక్షణరంగాలపై దృష్టి కేంద్రీకరించి యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ప్రధాని మోదీ చర్చలు జరుపనున్నట్టు ఆయన వెల్లడించారు.
ఇక ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నప్పుడే ప్రధాని మోదీ అమిత్ షాకు ఫోన్ చేసి ఢిల్లీ వరదలపై ఆరా తీశారు. కేంద్రం జోక్యంతోనే హర్యానా డ్యాం నుంచి వరదనీటి విడుదలను తగ్గించారు అధికారులు. కాగా మరోవైపు ఆప్ నిర్లక్ష్యంతోనే ఢిల్లీకి రికార్డు స్థాయిలో వరదనీరు వచ్చి చేరిందని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా అధికార విపక్షాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటుండగా ఢిల్లీ వాసులు మాత్రం తమను ఈ వరదల నుంచి కాపాడండి మహాప్రభో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.