Site icon Prime9

Pakistan Twin Blasts : పాకిస్థాన్ లో జంట పేలుళ్ళ కలకలం.. 13 మంది మృతి, 50 మందికి పైగా గాయాలు

Pakistan Twin Blasts leads to 13 deaths and 50 injured

Pakistan Twin Blasts leads to 13 deaths and 50 injured

Pakistan Twin Blasts : పాకిస్థాన్‌లో జంట పేలుళ్ళ వ్యవహారం కలకాలం సృష్టించింది. సోమవారం రాత్రి  వాయవ్య పాకిస్థాన్ లోని స్వాత్ లోయలో ఉగ్రవాద నిరోధక విభాగం (CTD) పోలీస్ స్టేషన్ పై జరిగిన ఈ జంట పేలుళ్లలో 13 మంది మరణించారు. సుమారు 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రెండు సార్లు పేలుడు చోటు చేసుకోవడంతో బిల్డింగ్‌ పూర్తిగా నేలమట్టయింది. ఈ నేపథ్యంలో ప్రావిన్స్‌ మొత్తం హై అలర్ట్‌ ప్రకటించినట్లు ఖైబర్‌ ఫఖ్తుంఖ్యా ఐజీ అక్తర్‌ హయత్‌ ఖాన్‌ వెల్లడించారు.

చనిపోయిన వారిలో కౌంటర్ టెర్రరిజం అధికారులే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. పేలుళ్లు జరిగిన సమయంలో ఆఫీసు పక్క నుంచి నడుచుకుంటూ వెళుతున్న తల్లీ కొడుకులు కూడా ప్రాణాలు కోల్పోయారని వివరించారు. అయితే ఈ బాంబు పేలుళ్లకు తామే బాధ్యులమని ఏ ఉగ్రవాద సంస్థ ఇంకా ప్రకటించలేదు. ఈ పేలుళ్లతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.  ఘటన స్థలానికి భద్రతా బలగాలు చేరుకొని ఆ ప్రాంతంను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటికి తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పేలుడు జరిగిన వెంటనే మంటలు వ్యాపించడంతో మృతుల సంఖ్య పెరిగినట్లు అధికారులు తెలిపారు.

కాగా ఈ అనూహ్య సంఘటన పట్ల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించి.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సంబంధిత ఘటన పట్ల వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల పాకిస్థాన్ లో పోలీస్ స్టేషన్లు, పోలీస్ స్థావరాలు లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ లో ఖైబర్ ఫక్తున్‌ఖ్వాలో కూడా ఇలాంటి తరహా ఉగ్రదాడి చోటు చేసుకుంది.

మరోవైపు ఇది ఆత్మాహుతి దాడి కాదని, ఆయుధాలు, మోటార్‌ షెల్స్‌ భద్రపరిచిన ప్రదేశంలో పేలుడు సంభవించిందని చెప్పారు. స్టేషన్‌పై ఎలాంటి దాడి కానీ, స్టేషన్‌ లోపల కాల్పులు కానీ జరగలేదని స్పష్టం చేశారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ పేలుళ్లు జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బాంబ్‌ డిస్పోజల్‌ స్వాడ్‌ కూడా దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version