Imran Khan’s party: ఇమ్రాన్ ఖాన్ పార్టీని నిషేధించాలని భావిస్తున్న పాకిస్తాన్ సర్కార్

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ)ని "నిషిద్ధ" సంస్థగా ప్రకటించాలని భావిస్తున్నట్లు పాకిస్తాన్ అంతర్గత మంత్రి రానా సనువల్లా చెప్పారు. దీనికోసం ప్రభుత్వం నిపుణులను సంప్రదిస్తుందని ఆయన పేర్కొన్నారు.

  • Written By:
  • Publish Date - March 19, 2023 / 05:58 PM IST

Imran Khan’s party: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ)ని “నిషిద్ధ” సంస్థగా ప్రకటించాలని భావిస్తున్నట్లు పాకిస్తాన్ అంతర్గత మంత్రి రానా సనువల్లా చెప్పారు. దీనికోసం ప్రభుత్వం నిపుణులను సంప్రదిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఉగ్రవాద సంస్ద..(Imran Khan’s party)

ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్‌లో ఉండగా, 10,000 మందికి పైగా సాయుధ పంజాబ్ పోలీసులు అతని నివాసంలోకి ప్రవేశించి డజన్ల కొద్దీ అతని మద్దతుదారులను అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ మీడియా నివేదించింది.ఉగ్రవాదులు జమాన్ పార్క్‌లో దాక్కున్నారు. ఇమ్రాన్ ఖాన్ నివాసం నుంచి ఆయుధాలు, పెట్రోల్ బాంబులు మొదలైనవి స్వాధీనం చేసుకున్నారు. ఇది ఉగ్రవాద సంస్థ అని పిటిఐపై కేసు నమోదు చేయడానికి తగిన సాక్ష్యమని మంత్రి సనువల్లా అన్నారు.ప్రధానంగా ఏదైనా పార్టీని నిషేధించినట్లు ప్రకటించడం న్యాయపరమైన ప్రక్రియ. అయితే, ఈ సమస్యపై మేము మా న్యాయ బృందాన్ని సంప్రదిస్తామని ఆయన తెలిపారు.

ఇమ్రాన్ ఖాన్ పిరికివాడు..

మరోవైపు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ ఎవరికైనా అనుమానం ఉంటే, గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ఛైర్మన్ ఇమ్రాన్ నియాజీ చేష్టలు అతని ఫాసిస్ట్ మరియు మిలిటెంట్ ధోరణులను బహిర్గతం చేశాయని అన్నారు. అతను తనను తాను రాజకీయ నేతగా ఎలా చెప్పుకుంటున్నాడా అని నేను ఆశ్చర్యపోతున్నాను. రాజకీయ నాయకులు జైలుకు వెళ్లడానికి మరియు జవాబుదారీతనానికి భయపడరు. దొంగలు మరియు ఉగ్రవాదులు మాత్రమే భయపడతారు. అరెస్టు భయం తోనే అతను కోర్టుకు కూడా హాజరుకాలేదు. అతను పిరికివాడని అన్నారు.

ఇస్లామాబాద్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్ అండ్‌ సెషన్స్‌ జడ్జి జాఫర్‌ ఇక్బాల్‌ ఇమ్రాన్‌ఖాన్‌ పై తోషాఖానా కేసు అరెస్టు వారెంట్‌ను రద్దు చేశారు. ఇస్లామాబాద్‌ జ్యూడిషియల్‌ కాంప్లెక్స్‌కు వెళ్లి అక్కడ సంతకం చేసి వెళ్లాలని ఖాన్‌ను జడ్జి ఆదేశించారు. తుదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేశారు. కాగా కోర్టు వద్ద పోలీసులకు , ఖాన్‌ పార్టీకి చెందిన పిటిఐ కార్యకర్తలకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చెలరేగింది. ఇదిలా ఉండగా కోర్టు బయట ఖాన్‌ మద్దతుదారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులు కోర్టు కిటికి అద్దాలు పగులగొట్టారు. దీంతో టియర్‌ గ్యాస్‌ పొగ కోర్టు గదిలోకి రావడంతో అప్పటికే కిటికిట లాడిపోతున్న కోర్టు గదిలో శ్వాస పీల్చుకోవడంలో కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి.

ఈ గందరగోళంలో జడ్జి ఖాన్‌ అరెస్టు వారెంట్‌ను రద్దు చేసి తిరిగి మార్చి 30వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. కోర్టు బయట జ్యూడిషయల్‌ కాంప్లెక్స్‌లో సంతకం చేసి వెళ్లాలని జడ్జి ఖాన్‌కు హుకుం జారీ చేశారు. కాగా కాంప్లెక్స్‌లోకి తనను అనుమతించలేదని, కాంప్లెక్స్‌ బయట చలా సేపు వేచి ఉండాల్సి వచ్చిందన్నారు. పోలీసులు, పిటిఐ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. కాగా ఇస్లామాబాద్‌ జ్యూడిషియల్‌ కాంప్లెక్స్‌ వద్దకు మోటార్‌సైకిల్‌పై పిటిఐ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. ఇమ్రాన్‌ ఖాన్‌ లండన్‌ నుంచి నవాజ్‌ షరీఫ్‌ ఆదేశాల ప్రకారం నడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అసలు ఉద్దేశం తనను అరెస్టు చేసి ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకోవడమేనని అన్నారు.