South Korea: ఒక లగ్జరీ బ్యాగ్ దక్షిణ కొరియా అధికార పార్టీని షేక్ చేస్తోంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. ప్రథమ మహిళ కిమ్ కియోన్ హీ ఖరీదైన బ్యాగ్‌ను బహుమతిగా పొందారంటూ వైరల్ అయిన దృశ్యాలు ఈ పరిస్థితి కారణమయ్యాయి.
వివరణ కోరుతున్న ఓటర్లు..(South Korea)
పీపుల్ పవర్ పార్టీకి చెందిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సతీమణి పేరు కిమ్ కియోన్ హీ. ఆమెకు ఒక పాస్టర్ డియోర్ బ్యాగ్ ఇస్తున్నట్లు ఉన్న స్పై కెమెరా దృశ్యాలు గతేడాది విడుదలయ్యాయి. లెఫ్ట్ వింగ్ యూట్యూబ్ ఛానల్‌లో ఈ ఫుటేజీ విడుదలైంది. ఆ పాస్టర్ తన వాచ్‌లో ఉన్న రహస్య కెమెరా ద్వారా దానిని చిత్రీకరించారు. దాని ఖరీదు 2వేల 250 అమెరికన్ డాలర్లు అని తెలుస్తోంది.ఆ ఫుటేజీలో ఆమె బ్యాగ్‌ను స్వీకరిస్తున్నట్లు స్పష్టంగా లేకపోయినా.. ఆ గిఫ్ట్ గురించి అధ్యక్ష కార్యాలయం ధ్రువీకరించిందని ఓ మీడియా సంస్థ వెల్లడించింది. అలాగే దానిని ప్రభుత్వ ఆస్తి కింద భద్రపరిచినట్లు తెలిపింది. ఈ వివాదంపై యూన్ కార్యాలయం త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 69 శాతం మంది ఓటర్లు దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతున్నారు.
కొరియా చట్టాల ప్రకారం ఒకేసారి 750 యూఎస్ డాలర్లు లేక ఒక ఏడాదిలో 2,200 డాలర్ల విలువైన బహుమతులను స్వీకరించడం చట్టవిరుద్ధం. దానితో ప్రస్తుతం ఈ అంశం అక్కడి రాజకీయాలను కుదిపేస్తోంది. ఏప్రిల్ నెలలో జరగనున్న ఎన్నికల్లో యూన్‌కు ఈ వివాదం చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోందన్న టాక్ దక్షిణ కొరియాలో బలంగా వినిపిస్తోంది.