Site icon Prime9

Lufthansa: సమ్మె సెగ..800 విమాన సర్వీసులు రద్దు చేసిన లుఫ్తాన్సా

Lufthansa

Lufthansa

Lufthansa: జర్మనీకి చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ లుఫ్తాన్సా కు సమ్మె సెగ తగిలింది. వేతనాలు పెంపు, సెలవుల విధానం కోరుతూ సంస్థకు చెందిన పైలట్లు ఈ రోజు నుంచి సమ్మెకు దిగడంతో లుఫ్తాన్సా 800 విమానాలు రద్దు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడింది. 5.5 శాతం వేతన పెంపు డిమాండ్‌ చేసింది. వచ్చేఏడాది నుంచి ద్రవ్యోల్బణం కంటే అధికంగా వేతన చెల్లింపులు చేయాలని యూనియన్‌ డిమాండ్‌ చేసింది. సెలవుల విధానంలోనూ మార్పులు చేయాలని కోరింది. అయితే, సీనియర్‌ పైలట్లకు 5 శాతం, కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి 18 శాతం పెంపుదలకు లుఫ్తాన్సా అంగీకరించింది. దీనిపై సంతృప్తి చెందని పైలట్లు నేటి నుంచి సమ్మెకు దిగారు.

పైలట్ల సమ్మె నేపథ్యంలో ప్యాసింజర్‌, కార్గో విభాగాలకు చెందిన 800 విమనాలను నిలిపివేస్తున్నట్లు లుఫ్తాన్సా ప్రకటించింది. దీంతో లక్ష మంది ప్రయాణికులపై ప్రభావం పడనుందని తన ప్రకటనలో పేర్కొంది. పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. శనివారం, ఆదివారం సైతం బుకింగ్‌ క్యాన్సిలేషన్లు, ఆలస్యాలు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.

ఇదిలా ఉండగా మరోవైపు లుఫ్తాన్సా విమనాల రద్దు ప్రభావం మన దేశ ప్రయాణికుల మీదా పడింది. దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లాంక్‌ఫర్ట్‌, మ్యూనిచ్‌ వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సుమారు 700 మంది ప్రయాణికులు, వారి సంబంధీకులు మరో 200 మంది విమానాశ్రయం లోపల, బయటా నిన్న రాత్రి ఆందోళన చేపట్టారు. తమకు పూర్తి రిఫండ్‌ ఇవ్వాలని, లేదంటే ప్రత్యామ్నాయ విమానాలు గానీ, హోటళ్లలో వసతి సదుపాయం గానీ కల్పించాలని డిమాండ్‌ చేశారు. అందుకు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ప్రయత్నాలు జరుగుతున్నాయని హామీ ఇవ్వడంతో ప్రయాణికులు శాంతించారు.

Exit mobile version