Kenya Flood Mayhem:కెన్యాలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలోని మై మహియు ప్రాంతంలో ఉన్న ఓల్డ్ కిజాబే డ్యామ్ కూలిపోయింది. దీనితో వరదలు సంభవించి రహదారులు ధ్వంసమవడమే కాకుండా 45 మంది మరణించారు. ఈ సంఘటన నేపధ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డ్యాములు, రిజర్వాయర్లను తనిఖీ చేయాలని అంతర్గత మంత్రి కితురే కిండికి అధికారులను ఆదేశించారు.
వరదల దాటికి పలు నివాస ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. చెట్లు నేలకూలి ట్రాఫిక్ స్తంభించింది. దీనితో వాహనదారులను అప్రమత్తం చేయాలని కెన్యా నేషనల్ హైవేస్ అథారిటీ హెచ్చరిక జారీ చేసింది.కెన్యా వ్యాప్తంగా 200,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద పీడిత ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునగడంతో ప్రజలు పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్నారు. భారీ వర్షాలకారణంగా టాంజానియాలో 155 మంది మరణించారు. కెన్యాలోని ఉత్తర గరిస్సా కౌంటీలో ఆదివారం రాత్రి పడవ బోల్తా పడి పలువరు ప్రయాణీకులు గల్లంతయ్యారు. కెన్యారెడ్ క్రాస్ 23 మందిని రక్షించారు. కెన్యా విమనాశ్రయం వరదనీటితో నిండిపోవడంతో పలుర విమానాలను దారి మళ్లించారు.