Israel Construction Sector: ఇజ్రాయెల్‌కు పొరుగున ఉన్న పాలస్తీనా పౌరులు ఉపాధి కోసం ఇజ్రాయెల్‌పై ఆధారపడుతుంటారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్నయుద్ధ క్రమంలో ఇజ్రాయెల్ నిర్మాణ రంగం పాలస్తీనా ఉద్యోగులను తీసేసి వారి స్థానంలో ఇండియాకు అవకాశం ఇవ్వాలని ఓ నిర్ణయానికి వచ్చింది.
ఇజ్రాయెల్ బిల్డర్స్ అసోసియేషన్ ఇండియా ప్రభుత్వంతో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతోంది. అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా బిల్డర్స్ ప్రతిపాదనను ఆమోదించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా ఇజ్రాయెలీ కన్సస్ర్టక్షన్ ఇండస్ట్రీ నెతన్యాహు ప్రభుత్వాన్ని భారత్ నుంచి సుమారు లక్ష మంది భారతీయ కార్మికులకు వర్క్ పర్మిట్ ఇచ్చి రప్పిద్దామని కోరింది. ఎందుకంటే అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయెల్‌పై దాడులు చేసిన వెంటనే పాలస్తీనాకు చెందిన 90వేల మంది కార్మికుల వర్క్ పర్మిట్లు రద్దు అయి పోయాయి. దీనికి ప్రత్యామ్నాయంగా భారతీయ కార్మికులకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఇజ్రాయెల్ బిల్డర్స్ ఉన్నారు.
ఇజ్రాయెల్ నిర్మాణరంగంలో పాలస్తీనియన్లే కీలకం..(Israel Construction Sector)
ప్రస్తుతం భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా దీనికి ఆమోదం తెలుపాల్సి ఉందని బిల్డర్స్ తెలిపారు. ఇండియా నుంచి నిర్మాణ రంగంలో సుమారు 50వేల నుంచి లక్ష మంది కార్మికులను రప్పించి నిర్మాణ పనులను తిరిగి యాధాస్థితికి తీసుకురావాలని అనుకుంటున్నట్లు ఇజ్రాయెల్ బిల్డర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ హెయిమ్ ఫెయిగ్లిన్ చెప్పినట్లు వాయిస్ ఆఫ్ అమెరికా వెల్లడించింది. ఒక అంచనా ప్రకారం ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో 25 శాతం కార్మికులు పాలస్తీనియన్లే అని ఇజ్రాయెల్ బిల్లర్డ్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. పాలస్తీనా కార్మికులు ఇక్కడ పనిచేయడానికి రాలేకపోతున్నారు. అదీ కాకుండా వారి వర్క్ పర్మిట్లు రద్దు చేసింది ఇజ్రాయెల్ ప్రభుత్వం. కాబట్టి వారికి ఇక్కడ పని ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మొత్తం పాలస్తీనా కార్మికుల విషయానికి వస్తే గాజా నుంచి సుమారు పది శాతం కార్మికులు ఇజ్రాయెల్‌కు వచ్చి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఫోకస్ అంతా గాజాపైనే ఉంది. మిగిలిన కార్మికులు వెస్ట్ బ్యాంకుకు చెందిన వారు.
ఈ ఏడాది మే నెలలో ఇజ్రాయెల్ ఇండియాలో ఒక ఒప్పందం చేసుకుంది. ఇండియాకు చెందిన 42వేల మందిని ఇజ్రాయెల్‌లో పనిచేసుకోవడానికి అనుమతిస్తామని ప్రకటించింది. ముఖ్యంగా నిర్మాణరంగంలో పాటు నర్సింగ్ రంగంలో వారికి ఉద్యోగాలు కల్పిస్తామని ముందుకు వచ్చింది. ఇరు దేశాలకు చెందిన మంత్రులు ఒక ఒప్పందానికి సంబంధించి ఓ ప్రకటనల చేశారు. 42వేల మంది భారతీయ కార్మికులు నిర్మాణ రంగంతో పాటు నర్సింగ్ రంగంలో ఉద్యోగాలు చేసుకోవడానికి అనుమతించాలని నిర్ణయానికి వచ్చాయని ఇజ్రాయెల్ విదేశాంగమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.