Site icon Prime9

Imran Khan: ప్రభుత్వ రహస్యాల లీక్ కేసు: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష

Imran Khan

Imran Khan

 Imran Khan: ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసిన కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది.పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్, వైస్ చైర్మన్ షా మహమూద్ ఖురేషీలకు సైఫర్ కేసులో పాకిస్థాన్‌లోని ప్రత్యేక కోర్టు మంగళవారం పదేళ్ల జైలు శిక్ష విధించింది.

తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌కు ట్రయల్‌ కోర్టు విధించిన శిక్షను ఇస్లామాబాద్‌ హైకోర్టు ఇటీవల నిలిపివేసింది. అయితే, ఆ వెంటనే సైఫర్‌ కేసులో ఆయన అరెస్టయ్యారు. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. ఈ కేసులో పాక్‌ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గతేడాది సెప్టెంబర్‌లో ఇమ్రాన్‌ ఖాన్, ఖురేషీలపై ఛార్జిషీట్ సమర్పించింది. భద్రతా సమస్యల దృష్ట్యా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అబ్దుల్‌ హస్నత్‌ జుల్కర్నైన్‌ జైల్లోనే ఇటీవల విచారణ చేపట్టారు. తాజాగా వారికి పదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.

బహిరంగ సభలో..( Imran Khan)

అమెరికాలోని పాకిస్థాన్‌ రాయబార కార్యాలయం మార్చి 2022లో ఓ కీలక అంశాన్ని పాక్‌కు చేరవేసినట్లు సమాచారం. పీటీఐ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమెరికా నుంచి ముప్పు పొంచి ఉందన్నది దాని సారాంశం. అదే ఏడాది ఇమ్రాన్‌ ప్రధానిగా దిగిపోయేముందు నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విదేశీ కుట్రకు ఆధారం ఇదిగోనంటూ కొన్ని పత్రాలు చేతిలో పట్టుకొని చూపించారు. అమెరికాలోని పాక్‌ ఎంబసీ నుంచి వాటిని సేకరించినట్లు చెప్పారు. దీంతో అఫీషియల్‌ సీక్రెట్స్‌ యాక్టును ఉల్లంఘించారనే అభియోగాలతో ఆయనతోపాటు మాజీ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషీలపై కేసు నమోదయ్యింది. ఈ కేసులోనే వీరికి తాజాగా శిక్ష పడింది.

ఇమ్రాన్‌ ఖాన్‌పై 2022 మార్చిలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రధానమంత్రి పదవిని వీడాల్సి వచ్చింది. అనంతరం ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 150 కేసులు నమోదైనట్లు అంచనా. తాజా తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తామని ఖాన్‌ పార్టీ పీటీఐ తెలిపింది. ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ కీలక తీర్పు వెలువడటం గమనార్హం. పీటీఐ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. కాగా పోలీసులు ఖాన్‌ పార్టీకి చెందిన కార్యకర్తలపై దాడులు చేస్తూ ప్రచారానికి కూడా అనుమతించడం లేదు. అదే సమయంలో ఎన్నికల కమిషన్‌ కూడా పిటిఐ ఎన్నికల గుర్తు క్రికెట్‌ బ్యాట్‌ను రద్దు చేసింది. ప్రస్తుతం ఎలాంటి గుర్తు లేకుండా ఇమ్రాన్‌ పార్టీ పోటీ చేయాల్సి వస్తుంది. ఖాన్‌పార్టీకి చెందిన పిటిఐ నాయకులు ఇండిపెండెంట్‌గా పోటీ చేయాల్సి దుస్థితి ఏర్పడింది. ఇమ్రాన్‌ నామినేషన్‌ను తిరస్కరించారు.అయితే ఖరేషిని మాత్రం థార్‌ నుంచి పోటీ చేయడానికి అనుమతించారు. అయితే తాజాగా ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇద్దరు ఐదు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అవుతారు.

 

 

Exit mobile version