Site icon Prime9

Imran Khan: ఈ జైల్లో ఉండలేను.. ఇక్కడినుంచి షిప్ట్ చేయండి. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

Imran Khan

Imran Khan

Imran Khan: తోషాఖానా కేసులో అరెస్టై.. జైల్లో ఉన్న పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ను ఓ చీకటి గదిలో ఉంచినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను ఆ పురుగుల జైల్లో ఉండలేనని.. అక్కడ నుంచి తీసుకెళ్లండని న్యాయవాదులతో వాపోయారు. సీ-క్లాస్‌ వసతులున్న జైల్లో పెట్టారని.. ఆ జైలు గదిలోనే పూర్తిగా నిర్బంధిస్తారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు పాక్‌ మీడియా వెల్లడించింది.

అవినీతి కార్యకలాపాల కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు ఇస్లామాబాద్‌ ట్రయల్‌ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో వెంటనే అరెస్టు చేసి.. పంజాబ్‌ ప్రావిన్సులోని అటక్‌ జైలుకు తరలించారు. అయితే, జైల్లో చిన్న చీకటి గదిలో ఆయన్ను ఉంచారని.. అందులో చీమలు, ఈగలు ఉన్నాయని తనను కలిసిన న్యాయవాదుల ముందు ఇమ్రాన్‌ ఖాన్‌ వాపోయారట. ఈ జైల్లో ఉండలేనని.. ఇక్కడ నుంచి తీసుకెళ్లమని కోరినట్లు న్యాయవాదులు వెల్లడించారు. ఎన్ని ఇబ్బందులున్నా ఇమ్రాన్‌ ఆత్మస్థైర్యంతోనే ఉన్నారని.. బానిసత్వానికి తలొగ్గనని చెప్పినట్లు పాక్‌ మీడియాకు వివరించారు.

ఇస్లామాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌..(Imran Khan)

మరోవైపు అటక్‌ జైల్లో ఉన్న తమ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ను అదియాలా జైలుకు మార్చాలని.. ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరుతూ పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ పార్టీ సభ్యులు ఇస్లామాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే సమయంలో ఇమ్రాన్‌పై అయిదేళ్లపాటు అనర్హత వేటు వేస్తున్నట్లుగా పాక్‌ ఎన్నికల సంఘం ప్రకటించింది.ఇదిలా ఉండగా పాకిస్థాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తోషాఖానాలోని బహుమతులను వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు. తోషాఖానా కానుకల ద్వారా వచ్చిన డబ్బును పేదలు, నిస్సహాయకుల కోసం వినియోగిస్తామని వెల్లడించారు.

 

Exit mobile version
Skip to toolbar