Pakistan Floods: పాక్‌లో సగం భూభాగం నీటిలోనే.. హెలికాప్టర్‌ దిగడం కూడ కష్టమే..

భారీ వరదలతో పాకిస్థాన్ విలవిల్లాడిపోతోంది. జులై నుంచి పాక్ లో అసాధారణ రుతుపవన ప్రభావం కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. సింధ్ , బలోచిస్థాన్ , ఖైబర్ పక్తుంఖ్వాలో తీవ్ర ప్రభావం ఉంది. ఇప్పటి వరకు పాక్ లోని 150 జిల్లాల్లో 110 చోట్ల వరదలు వచ్చినట్లు తెలిపింది పాక్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ.

  • Written By:
  • Publish Date - August 31, 2022 / 11:12 AM IST

Pakistan Floods: భారీ వరదలతో పాకిస్థాన్ విలవిల్లాడిపోతోంది. జులై నుంచి పాక్ లో అసాధారణ రుతుపవన ప్రభావం కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. సింధ్ , బలోచిస్థాన్ , ఖైబర్ పక్తుంఖ్వాలో తీవ్ర ప్రభావం ఉంది. ఇప్పటి వరకు పాక్ లోని 150 జిల్లాల్లో 110 చోట్ల వరదలు వచ్చినట్లు తెలిపింది పాక్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ. పాకిస్తాన్‌లో సగం కంటే ఎక్కువ భాగం నీటిలో మునిగిపోయింది. సహాయ చర్యలకు హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు కూడా స్థలం లేకుండా పోయిందని అధికారులు చెబుతున్నారు.

వరదల్లో ఇప్పటి వరకు 1,061 మంది చనిపోగా.. 4 లక్షల 52 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. మొత్తం 2 లక్షల 18 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో ఆకస్మిక వరదలతో వేల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. దాదాపు 8 లక్షల పశువులు చనిపోగా.. దాదాపు 20 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. పాక్ లోని ఖైబర్ పక్తుంఖ్వాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మనూర్ వ్యాలీలో ఆకస్మిక వరదలకు అక్కడ 10 వంతెనలను కూల్చేశాయి. ఫలితంగా ఆహారం, మందుల సరఫరా కష్టంగా మారిపోయింది. బలోచిస్థాన్ లో 5 రెట్లు అధికంగా వర్షం పడింది. ఇప్పటికే పాక్ వ్యాప్తంగా 354.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతమైన 113 మిల్లీమీటర్ల కంటే మూడు రెట్లు అధికం. భవిష్యత్తులో మరిన్ని వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అంచనా వేస్తుంది పాక్ వాతావరణ శాఖ.

మరోవైపు పాక్ వరదల వల్ల చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు ప్రధాని మోదీ. వరదల నుంచి పాక్ ప్రజలు కోలుకోవాలని ఆకాంక్షించారు. వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సాయం అందించడానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు వెల్లడించారు.