Shani Louk: హమాస్ ఉగ్రదాడిలో బందీ అయిన జర్మనీ యువతి షానీ లౌక్ మృతదేహాన్ని తాజాగా ఇజ్రాయెల్ గుర్తించింది. గాజాలోకి ప్రవేశించిన తమ దళాలు ఆ మృతదేహాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. షాని కుటుంబం కూడా ఆమె మృతిని సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించింది. జర్మన్-ఇజ్రాయెల్‌కు చెందిన షానీ లౌక్ మృతదేహాన్ని గుర్తించాం. ఆమె మృతి గురించి తెలిసి మా హృదయం ముక్కలైంది. షానిని మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి హమాస్ మిలిటెంట్లు అపహరించారు. తీవ్రంగా వేధించారు. తర్వాత గాజా మొత్తం ఊరేగించారు. ఆమె అంతులేనివేదనను అనుభవించారు. ఆమె పరిస్థితితో మా హృదయం ముక్కలైంది’ అంటూ ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది.
బంధించి.. నగ్నంగా ఊరేగించి..(Shani Louk)
ఈ నెల 7న ఇజ్రాయెల్ లో సూపర్‌నోవా మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో హమాస్ మిలిటెంట్లు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. గాజా సరిహద్దుకు సమీపంలో హమాస్ సృష్టించిన నరమేధంతో ఫెస్టివల్ జరిగిన ప్రాంతంలోనే 260మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌పై దాడిలో 1,400 మంది మరణించారు. కాగా మిలిటెంట్లు కొందరిని బందీలుగా తమ వెంట తీసుకెళ్లారు. వారిలో 23 ఏళ్ల షాని లౌక్ కూడా ఉంది.తమ కుమార్తెను సురక్షితంగా తిరిగి తీసుకురావాలని షాని తల్లి జర్మనీ, ఇజ్రాయెల్ ప్రభుత్వాలను విజ్ఞప్తి చేసిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. మాకు ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో కారులో అపస్మారక స్థితిలో ఉన్న నా కుమార్తెను చూశాను. ఆ కారును గాజా నగరమంతా తిప్పడం కనిపించింది అని ఆమె తల్లి వాపోయింది. షానిని బంధించిన తర్వాత ఆమెను పికప్ ట్రక్కులో నగ్నంగా ఊరేగించిన వీడియో వెలుగులోకి వచ్చింది.
హమాస్ మద్దతుదారులు షేర్ చేసిన ఆ వీడియోపై అంతర్జాతీయంగా వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక, హమాస్ ఉగ్రదాడితో ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటోంది ఇప్పటికే వైమానిక దాడులతో విరుచుకుపడుతోన్న ఇజ్రాయెల్ సైన్యం..గాజాలోకి ప్రవేశించి పరిమిత స్థాయిలో భూతల దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.