Site icon Prime9

Dubai Rains:దుబాయ్ ను మరోసారి ముంచెత్తిన భారీ వర్షాలు

Dubai Rains

Dubai Rains

Dubai Rains:యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌ను వరదలు ఒక పట్టాన వదిలేట్టు కనిపించడం లేదు. గత నెల దుబాయిలో గత 70 ఏళ్లలో ఎన్నడూ కురవని విధంగా భారీ వర్షాలు దుబాయిని అతలాకుతలం చేశాయి. జనజీవనం అస్తవ్యస్తం అయిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం ఉదయం మరో మారు అబుదబితో పాటు దుబాయిని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో దుబాయిలో విమాన సర్వీసులతో పాటు బస్సు సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది.

సేఫ్టీ నిబంధనలు పాటించాలి..(Dubai Rains)

స్థానిక మీడియా కథనాల ప్రకారం గురువారం ఉదయం 3 గంటల నుంచే ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిశాయని… ఒక గంట పాటు కురిసిన భారీ వర్షాల తర్వాత వాతావరణశాఖ అంబర్‌ అలెర్ట్‌ జారీ చేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం అయ్యింది. ఇదే పరిస్థితి మే 3 వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు సెప్టీ నిబంధనలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది. అబుదబీ లోని కొన్ని రోడ్లలో నీళ్లు నిలిచాయి. జెబెల్‌ అలీ, అల్‌ మక్తుమ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌, దుబాయి ఇండస్ర్టీయల్‌ సిటి, దుబాయి ఇన్వెస్ట్‌మెంట్‌ పార్క్‌, జుమెయిరా విలేజి, ట్రైయాంగ్‌ ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీచాయని స్థానిక మీడియా తెలిపింది. ఇదిలా ఉండగా బుధవారం నాడు దుబాయి ఎయిర్‌పోర్ట్ తో పాటు రెండు స్థానిక ఎయిర్‌లైన్స్‌ కూడా ప్రయాణికులకు ట్రావెల్‌ అడ్వయిజరీలు జారీ చేసింది. దుబాయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టకు వెళ్లే ముందు పూర్తి సమాచారం తెలుసుకొని వెళ్లాలని సూచించింది. దీనికి కారణం భారీ వర్షాలకు విమానాలు రద్దు కావడమో లేదా షెడ్యూలో మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపింది.

ఇక ఖలీజ్‌ టైమ్స్‌ ప్రకారం వచ్చే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవవచ్చునని… గురువారం సాయంత్రం వరకు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఆఫీస్‌లకు వెళ్లే వారు వర్క్‌ ఫ్రం హోం అలాగే దుబాయితో పాటు షార్జా లో స్కూళ్లకు డిస్క్టాన్స్‌ లెర్నింగ్‌ చేసుకోవాలని సూచించింది. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు దుబాయిలో కనీసం ముగ్గురు చనిపోయారు. సాధారణ జనజీవం స్తంభించిపోయింది. వందలాది విమానాలు రద్దు కావడమో.. లేదా ఆలస్యంగా నడవడమో లేదా రూటు మార్చడమో జరిగాయి. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు దుబాయితో పాటు అబుదబి ఇంకా కోలుకోలేదు. తాజాగా గురువారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షాలకు మరోమారు దుబాయి, అబుదబి ప్రజలు వణికిపోయారు.

Exit mobile version