China Releases New Map: బ్రిక్స్ దేశాల సదస్సులో మన ప్రధాని మోదీతో కలిసి పాల్గొని నాలుగు రోజులు కూడా కాకముందే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మరోసారి తన కుటిల బుద్ధిని బయటపెట్టుకున్నారు. నిన్న అంటే ఆగస్టు 28న చైనా విడుదల చేసిన కొత్త మ్యాపులో భారతదేశానికి చెందిన ప్రాంతాలని తమవని చెబుతూ ముద్రించారు.
భారతదేశానికి చెందిన అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్‌ని తమ ప్రదేశాలుగా చైనా తన మ్యాపులో చూపించింది. దక్షిణ టిబెట్‌లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌ని చైనా చాలాకాలం చెబుతూ వస్తోంది. ఇప్పుడు అధికారిక మ్యాపులో దానిని మరోసారి క్లెయిమ్ చేసింది. ఒక్క భారత ప్రాంతాలే కాదు.. తైవాన్, దక్షిణ చైనా సముద్రం కూడా తమవేనని మ్యాపులో స్పష్టంగా చైనా పేర్కొనడం గమనార్హం.
ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనా ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాల పేర్లను “ప్రామాణికం” చేస్తామని చెప్పింది. అంతేకాకుండా, చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు దగ్గరగా ఉన్న పట్టణాన్ని చేర్చింది. భారతదేశం, అనేక సందర్భాల్లో, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం “ఎల్లప్పుడూ ఉంది” మరియు “ఎల్లప్పుడూ” దేశంలో అంతర్భాగంగా ఉంటుందని గట్టిగా నొక్కి చెప్పింది. న్యూఢిల్లీలో జరగబోయే G20 సమ్మిట్‌కు 42 మంది ఇతర దేశాధినేతలతో సహా చైనా అధ్యక్షుడిని ఆహ్వానించిన నేపధ్యంలో చైనా దుందుడుకు చర్యకు పాల్పడటం గమనార్హం.