COVID-19 Alert: అమెరికా, బ్రిటన్‌లో ఒమిక్రాన్‌ కొత్త వెరియెంట్లు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్రత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టింది. పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గింది. ఈ క్రమంలో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్లు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా కోవిడ్‌లో ఒమిక్రాన్‌ బీఏ.4.6 అనే కొత్త వేరియంట్‌ అమెరికా, బ్రిటన్‌లతో సహా పలు దేశాల్లో విస్తరిస్తోంది.

  • Written By:
  • Publish Date - September 15, 2022 / 06:00 PM IST

Omicron variants: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్రత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టింది. పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గింది. ఈ క్రమంలో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్లు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా కోవిడ్‌లో ఒమిక్రాన్‌ బీఏ.4.6 అనే కొత్త వేరియంట్‌ అమెరికా, బ్రిటన్‌లతో సహా పలు దేశాల్లో విస్తరిస్తోంది. దీంతో, పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

కొత్త వేరియెంట్‌ బ్రిటన్‌లో విస్తృతంగా కొనసాగుతోంది. తమ దేశంలో సేకరించిన మొత్తం నమూనాల్లో 3.3% ఈ రకాలే ఉన్నట్లు యూకే ఆరోగ్య భద్రతా సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. తాజాగా ఈ సంఖ్య 9 శాతానికి చేరినట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు, అమెరికాలో సైతం ఈ వేరియంట్‌ కేసులు 9 శాతానికి పైగానే నమోదు అవుతున్నట్టు సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సంస్థ వెల్లడించింది. కేవలం ఈ రెండు దేశాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం కొత్త వేరియంట్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. కాగా, ఒమిక్రాన్‌ బీఏ.4.6 కూడా బీఏ.4 లాంటిదేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, కొత్త వేరియంట్‌, టీకాలు తీసుకున్న వారిపై కూడా అటాక్‌ చేస్తుంది. ఇక, ఒమిక్రాన్‌లోని ఇతర వేరియంట్ల మాదిరిగానే దీనివల్ల కూడా వ్యాధి తీవ్రత, మరణాలు సంభవించే అవకాశాలు తక్కువని వైద్యులు స్పష్టం చేశారు. కాగా, ఈ ఏడాది జనవరిలో బీఏ.4 వేరియంట్‌ ఆఫ్రికాలో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత బీఏ.5 వేరియంట్‌ ప్రపంచ దేశాల్లో వ్యాప్తిచెందింది.

భారత్‌ దేశానికి వస్తే ఇక్కడ కూడా కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిని 24 గంటల్లో దేశంలో కొత్తగా 5వేల108 పాజిజివ్‌ కేసులు నమోదు కాగా, వైరస్‌ కారణంగా 19 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45వేల749 యాక్టివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. కాగా నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 5వేల675 మంది కోలుకున్నారని ఆరోగ్య ఒక ప్రకటనలో పేర్కొంది.