Summer Drinks: ఎండలు రోజు రోజుకు మండిపోతున్నాయి. ఉదయం పది గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. అయితే ఈ ఎండలతో శరీరం డీ హైడ్రేషన్‌కు గురవుతుంది. అందువల్ల నీరసించిపోవడం, వడదెబ్బ తగలడం లాంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
చాలామంది ఎండ వేడిమి తట్టుకోవడానికి చల్లటి డ్రింక్స్ ను ఎంచుకుంటారు. అయితే కృత్రిమమైన కూల్ డ్రింక్స్ తో ఆరోగ్యానికి హాని తప్ప మరే ప్రయోజనం లేదు. కాబట్టి సహజ సిద్ధంగా తయారు చేసుకునే పానీయాలు తీసుకుంటే శరీరానికి చాలా మంచిది.
పెరుగులో కావాల్సినన్ని నీళ్లు పోసుకుని గిలకొట్టి చల్ల చేసుకోవాలి. ఈ చల్లలో నిమ్మ ఆకులు వేసి, కొంచెం ఉప్పు, కరివేపాకు చేర్చి తాగితే ఒంట్లో వేడి చాలా త్వరగా తగ్గిపోతుంది.
నాలుగు చెంచాల ఆమ్‌చూర్ పొడి, అంతే కొలతలో మెంతి పొడి, అర చెంచా వేయించిన జీలకర్ర పొడి, రెండు చెంచాల నల్ల ఉప్పు, చక్కెర, అర చెంచా మిరియాల పొడి కలిపి మిశ్రమంగా చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని చల్లటి నీళ్లలో కలిపితే జల్‌జీరా మిశ్రమం రెడీ అవుతుంది. అది తాగితే డీ హైడ్రేషన్ సమస్య తగ్గిపోతుంది.
ఎండ తీవ్రత విపరీతంగా ఉన్నప్పుడు ఒక్కోసారి అకస్మాత్తుగా ఒళ్లంతా నిస్సత్తువగా మారుతుంది. ఒక్కసారిగా నీరసం ఆవహిస్తుంది.
ఇలాంటి సందర్భంలో కొబ్బరి నీళ్లు తాగితే తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
వేసవిలో బాడీని డీ హైడ్రేషన్ నుంచి కాపాడుకోవడంలో షర్బత్ బాగా పని చేస్తుంది.
గ్లాసెడు నీళ్లలో సగం నిమ్మకాయ పిండుకుని రెండు టీ స్పూన్‌ల చక్కెర కలుపుకుని షర్బత్ చేసుకుని తాగొచ్చు.
సోంపు గింజలతో చేసిన డ్రింక్ ను వేసవిలో రోజూ తాగితే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీరం ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి.
డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉండొచ్చు. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. అధిక బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఈ సోంపు గింజల డ్రింక్ లో ఉన్నాయి.
సోంపు గింజలను పొడిని నీటితో 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టాలి. నల్లటి ఎండు ద్రాక్షను కూడా నానబెట్టుకోవాలి.
మూడు గంటల తర్వాత సోంపు గింజల పొడి నీటిని వడకట్టి దానిని ఓ గ్లాసులోకి తీసుకోవాలి.
తర్వాత ఎండు ద్రాక్షను మెత్తగా చేసుకుని ఆ సోంపు నీటిలో కలపాలి.
ఈ మిశ్రమంలో పటిక బెల్లం, నిమ్మరసం, సరిపడా నీళ్లు కలుపుకుంటే సోంపు గింజల డ్రింక్ తయారవుతుంది.