Site icon Prime9

Elephant Foot Yam: దీపావళి రోజు “కంద” తింటే లక్ష్మీదేవి మీ ఇంట తిష్టవేస్తుందట

diwali special food elephant foot yam

diwali special food elephant foot yam

Elephant Foot Yam: ఒక్కో పండుగకు ఒక్కో విశిష్టత ఉంటుంది. దానికి తగినట్టుగానే వస్త్రధారణ, అలంకరణ, వంటకాలు ఉంటాయి. పండుగలను బట్టి ఆ రోజు తినాల్సిన ఆహారం కూడా సంప్రదాయంగా వస్తూ ఉంది. అయితే దీపావళి రోజు కచ్చితంగా స్వీట్లు తినాలని పెద్దలంటారు. సంక్రాంతికి అరిసెలు, అట్లతద్దికి అట్లు ఎలాగైతే ఆనవాయితీగా వస్తున్నాయో అలానే దీపావళికి కంద దుంపతో వండిన వంటకాలు తినాలనే ఆచారం ఉంది. ఇలా దీపావళి రోజున కంద తినడం వల్ల సంపద కలిసొస్తుందని నమ్మకం. మరి ఈ వెలుగుల పండుగ రోజు మిఠాయి తినడానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అదేవిధంగా కందదుంపతో తినే వంటకాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని వారణాసిలో కచ్చితంగా పాటిస్తారు.

కందను ‘ఎలిఫేంట్ ఫుట్’ అని పిలుస్తారు. దీనితో కూర లేదా పులుసు వండుకుని తింటుంటారు. మరీ ముఖ్యంగా దివాళీ నాడు ఇలా చెయ్యడం శుభప్రదమని అంటారు. వారణాసిలో కాయస్త్ అని పిలిచే తెగ వారు దీపావళి రోజు కంద కూర వండుకుని తింటారు. ఇది వారు కచ్చితంగా పాటించే నియమం. అంతే కాకుండా కందను లక్ష్మీ పూజలో ఉంచడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని అంటారు. అలాగే, ఈ కూరగాయను మీ ఇంట్లో పెంచడం వల్ల కుటుంబానికి సంపద, సంతోషం కలుగుతుందని అంటారు. ఇంట్లో పెంచిన కందను దీపావళి రోజున బయటకు తీసి వండాలని నమ్ముతారు.

కందదుంప తినమనడంలో అనేక ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. ఇది తినడం వల్ల శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ తగ్గుతుంది. ఈ దుంపలో యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. అలాగే అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అనేక ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. కందలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా ఎంతో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ అధికంగా ఉంటాయి. ఈ దుంపను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో పైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ఇదండీ మొత్తం మీద కంద కథ. మరి ఈ దీపావళి రోజు మీరూ కంద కూర తింటారు కదూ.

అందరికీ ఆ లక్ష్మీదేవి సిరిసంపదలు, భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు అనుగ్రహించాలని కోరుతూ “ప్రైమ్9″ తరఫున మరోసారి మీ అందరికీ దీపావళి శుభకాంక్షలు. పర్యావరణహితంగా దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని కోరుతున్నాము.

ఇదీ చదవండి: దీపావళికి ఈ 4 లక్ష్మీ ఆలయాలను సందర్శిస్తే సిరిసంపదలు మీ సొంతం

Exit mobile version