Tholiprema Re Release: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లోని సూపర్ హిట్ చిత్రాల్లో తొలిప్రేమ ఒకటి. ఈ సినిమా ఎప్పటికీ ఓ ఎవర్ గ్రీన్ మూవీ అనే చెప్పాలి. టాలీవుడ్ పై ఈ సినిమా చూపించిన ప్రభంజనం అలాంటిది మరి. ఆ తరం కుర్రకారుకి ఈ సినిమాతో ఎన్నో మధుర జ్ఞాపకాలుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఈ సినిమాపై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలు అందించిందని, తన జీవితంలో ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉందని ఎమోషనల్ అయ్యారు. డబ్బులు తక్కువగా ఉన్నప్పుడల్లా ఈ చిత్రాన్ని తాను రీ-రిలీజ్ చేసినట్లు వివరించారు. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో ఈ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్ గా పని చేశానని దిల్ రాజు చెప్పుకొచ్చారు. తన జీవితాన్ని ఒక పుస్తకంలా రాస్తే తొలిప్రేమకు తప్పకుండా ఒక పూర్తి పేజీ ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను తాను తీసినప్పటికీ, తొలిప్రేమ మాత్రం తనకు చాలా ప్రత్యేకం అన్నారు.
అది ఓ చరిత్ర(Tholiprema Re Release)
తొలిప్రేమ సినిమా వందో రోజునే ఇండియా – పాక్ మ్యాచ్ జరిగిందని చెప్పారు. ఆ రోజుల్లో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరూ టీవీలకు అతుక్కుపోయి ఇండియా గెలవాలంటూ ఎంతో ఆసక్తిగా మ్యాచ్ చూస్తారని కానీ, ఆ రోజు కూడా ప్రేక్షకులు తొలిప్రేమ సినిమాను చూసేందుకు సంధ్య థియేటర్ వద్ద భారీగా క్యూ కట్టారన్నారు. ఇలాంటి సంఘటనలు జరగడం ఓ చరిత్ర అంటూ వివరించారు. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ కు అయిదేళ్ల పాటు తనకు హక్కులు ఇచ్చారని, దీంతో డబ్బులు తక్కువగా ఉన్న ప్రతిసారి ఈ సినిమాను మళ్లీ విడుదల చేస్తూ వెళ్లానన్నారు. ఈ రోజు తాను ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉండటానికి తొలిప్రేమ సినిమానే ఒక కారణమన్నారు. ఈ సినిమా తనకు ఎన్నో నేర్పించిందంటూ తొలిప్రేమ రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో దిల్ రాజు చెప్పారు.