Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒకవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీర మల్లు’ సినిమా చేస్తున్నాడు. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సుజీత్ డైరెక్షన్ లో #OG సినిమాలు చేస్తున్నారు. కాగా గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ సినిమా చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది.
‘వినోదయ సీతమ్’కి రీమేక్
తమిళంలో మంచి హిట్ సాధించిన ‘వినోదయ సీతమ్’కి రీమేక్ గా ఆ మూవీ రానుంది. దీనికి ప్రముఖ నటుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. కాగా ఈ రీమేక్ కి కూడా సముద్రఖని దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. గతంలో తెలుగులో రవితేజ నటించిన ‘శంభో శివ శంభో’ సినిమాకి ఈయన దర్శకత్వం చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ నిడివి తక్కువే ఉంటుందని.. అందుకని ముందు ఈ సినిమా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మొత్తంగా ఈ మూవీ కోసం దాదాపు 20 రోజులు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చారని సమాచారం.
ప్రేమికుల రోజున మూవీ స్టార్..
కాగా ఇప్పుడు తాజాగా వచ్చే వారం నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుందని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న ఈ మూవీని స్టార్ట్ చేయబోతున్నారట. గత ఏడాది జూన్ నెలలో కొబ్బరికాయ కొట్టినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి. అయితే ఆ విషయాన్ని ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదని అంటున్నారు. కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది ‘వినోదయ సీతమ్’ సినిమా స్టోరీగా తెలుస్తుంది.
దేవుడిగా పవన్ కళ్యాణ్
తెలుగులో భగవంతుని పాత్రను పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చేయనుండగా.. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా సాయి ధరమ్ తేజ్ నటించనున్నారు. దీంతో పవన్ దేవుడి పాత్రలో నటించడం ఇది రెండోసారి అవుతుంది. అంతకు ముందు విక్టరీ వెంకటేష్ తో కలిసి చేసిన ‘గోపాల గోపాల’లో.. పవన్ మోడ్రన్ శ్రీ కృష్ణుని పాత్ర చేశారు. ఇక పవన్ ఫ్యాన్స్ మళ్ళీ ఫుల్ ఖుషి అవ్వడం గ్యారంటీ అని తెలుస్తుంది. చూడాలి మరి ఈ విషయాన్ని ఎప్పుడు రివీల్ చేస్తారో అని..
‘హరి హర వీరమల్లు’కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రతినాయకుడిగా ఔరంగజేబు పాత్రలో హిందీ హీరో బాబీ డియోల్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో నర్గిస్ ఫక్రీ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు అమ్మాయి పూజితా పొన్నాడ కూడా ఓ రోల్ చేస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు.