Adipurush: ఆదిపురుష్ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో మూవీ బృందం కూడా శరవేగంగా ప్రమోషన్స్ చేస్తుంది. అలాగే సినిమాని పూర్తిగా ఆధ్యాత్మికంగా జై శ్రీరామ్ అంటూ ప్రమోట్ చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఆదిపురుష్ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో ఆ నిర్మాణ సంస్థ ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది.
సినిమా రిలీజ్, థియేటర్స్ కు సంబంధించి అధికారికంగా ఓ లెటర్ ని విడుదల చేసింది. అందులో.. రామాయణ పారాయణం జరిగే ప్రతి చోట హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమాని ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటును విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది. అతి గొప్ప రామ భక్తునికి గౌరవ మర్యాదలు సమర్పిస్తూ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ హంగులతో నిర్మించిన ఆదిపురుష్ ని హనుమంతుడి సమక్షంలో అందరం తప్పక వీక్షిద్దాం అని తెలిపారు. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది.
ఈవెంట్ లో చాలా స్పెషల్స్(Adipurush)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానితో జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో నేడు జూన్ 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుపతిలో ఘనంగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దాని కోసం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మైదానం సుందరంగా ముస్తాబయ్యింది. అయితే ఈ ఈవెంట్ లో చాలా స్పెషల్స్ ఉన్నాయనే చెప్పాలి. ఎన్నడూ చూడని విధంగా ఎప్పడూ జరగని విధంగా భారీగా, ప్రత్యేకంగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ చేస్తుండటంతో ఈ కార్యక్రమంపై మరింత క్యూరియాసిటీ పెంచింది.