Shaan Muttathil: ఇపుడు ఎక్కడ చూసినా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటే వినిపిస్తోంది. నాటు నాటు ‘ఆస్కార్’ అవార్డుల నామినేషన్ లో చోటు దక్కించుకున్నప్పటి నుంచి దేశమంతా కోరుకుంది ఒకటే.. మన భారతీయ సినిమాకు ఆస్కార్ రావాలి అని. ఆ క్షణం కోసం కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.
అందరూ అనుకున్నట్టుగానే అంతర్జాతీయ వేదికపై ఇండియన్ సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటుతూ ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ ను గెలుచుకుంది.
దీంతో తెలుగు ప్రజలతో పాటు యావత్ దేశం సంబరాలు చేసుకుంటోంది.
ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే ఎంతటి చారిత్రాత్మక విజయాలు సాధించినా.. కొన్ని విమర్శలు ఎదుక్కోవాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే బాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మేకప్ ఆర్టిస్ట్ షాన్ ముత్తతిల్ ఆస్కార్ అవార్డులపై ఓ పోస్ట్ ను షేర్ చేశారు.
ఇప్పుడా ఆ పోస్ట్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు.
ఎగతాళి చేస్తూ ఓ పోస్ట్(Shaan Muttathil)
ఆస్కార్ అవార్డుల వేడుకలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాటు గునీత్ మోంగా తీసిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ కు కూడా ఆస్కార్ లభించింది.
దీంతో దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. అయితే ఈ విజయాన్ని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మేకప్ ఆర్టిస్ట్ ముత్తతిల్ ఎగతాళి చేస్తూ ఓ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
మన దేశంలో లాగానే.. మేకర్స్ అవార్డులను కొన్నారు అంటూ కామెంట్ చేశాడు.
ఇది చాలా కామెడీగా ఉందని.. ఇన్ని రోజులూ భారత దేశంలోనే అవార్డులను కొనగలమని అనుకున్నానని, కానీ ఇప్పుడు ఆస్కార్ ను కూడా కొంటున్నారని వ్యాఖ్యానించాడు.
మన దగ్గర డబ్బు ఉంటే ఏదైనా పొందొచ్చు అంటూ కామెంట్స్ పెట్టారు. అయితే అతని వ్యాఖ్యలపై నెటిజన్స్ మండిపడుతున్నారు.
నాటు నాటు పై దీపికా స్పెషల్ ఇంట్రో
నాటు నాటుకు ఆస్కార్ ప్రకటించే ముందు ఈ పాటను బాలీవుడ్ నటి దీపికా పదుకొణె పరిచయం చేశారు.
అనంతరం సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లైవ్‌లో పాట పాడారు.
ఈ సందర్భంగా పాట నేపథ్యం గురించి అవార్డుల వేడుకకు హాజరైన వారికి దీపిక స్పెషల్ గా వివరించడం విశేషం.
‘తిరుగులేని సింగర్స్.. ఉర్రూతలూగించే బీట్స్.. అదరహో అనిపించిన స్టెప్పులు ఈ పాటను ప్రపంచ సంచలనంగా మార్చాయి.
విప్లవకారులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ మధ్య గొప్ప స్నేహాన్ని చాటి చెప్పింది ‘ఆర్‌ఆర్‌ఆర్’.ఈ సినిమాలోని కీలక సన్నివేశంలో వచ్చే పాట ఇది.
దీన్ని తెలుగులో పాడటంతో పాటు వలసవాద వ్యతిరేక ఇతివృత్తాన్ని సజీవంగా ప్రదర్శించడంతో ఇది సంచలనం సృష్టించింది.
యూట్యూబ్, టిక్‌టాక్‌లలో కోట్లాది వీక్షణలను సొంతం చేసుకుంది. అంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో థియేటర్లలో ప్రేక్షకులతో స్టెప్పులు వేయించింది.
అంతేనా.. భారత సినీ ఇండస్ట్రీ నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి పాటగా హిస్టరీ లో కెక్కింది.
‘డు యూ నో నాటు?’ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో ‘నాటు నాటు’ ఇదే..’ అంటూ దీపిక ఈ పాటను పరిచయం చేశారు.
దీంతో అక్కడున్నవారంతా చప్పట్లతో నాటు నాటు పాటకు ఘన స్వాగతం పలికారు.
ఇలాంటి అత్యంత ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేడుకను ఎగతాళి చేస్తూ కామెంట్స్ చేయడంపై షాన్ పై మండిపడుతున్నారు.