NTR Satha Jayanthi : హైదరాబాద్ లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు. సినీ, రాజకీయ ప్రముఖులు.. ఈ వేడుకలో పాల్గొని ఎన్టీఆర్ గురించి, ఆయనతో తమకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు. మురళీమోహన్, జయప్రద, జయసుధ, కృష్ణవేణి లాంటి సీనియర్ నటీనటులు.. నాగ చైతన్య, సుమంత్, అడివిశేష్, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక సేన్ లాంటి ఈ తరం నటులు, డైరెక్టర్ అనిల్ రావిపూడి, నటి శ్రీ లీల కూడా హాజరయ్యారు. ఇక మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరయ్యారు. ఇక ఈ వేడుకకు మెగా కుటుంబం నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గురించి గొప్పగా మాట్లాడారు. అలానే ఆయనతో ఉన్న ఒక మెమొరీని ఏఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఇప్పుడు విదేశాల్లో మన తెలుగు సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. సౌత్ ఇండియన్ సినిమా బావుందని అందరూ అనుకుంటున్నారు. కానీ, ఆ రోజుల్లోనే ఎన్టీఆర్ గారు మన పవర్ ఏంటో చూపించారు. ఆయన్ను మనం ఎప్పటికీ మరచిపోకూడదు. గుర్తు చేసుకుంటూనే ఉండాలి” అని రామ్ చరణ్ అన్నారు. ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే తనకు ఎక్కడ మొదలు పెట్టాలో తెలియటం లేదని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు. అన్ని స్థాయిలకు మించిన పెద్ద పేరు నందమూరి తారక రామారావు అని కొనియాడారు. తెలుగు ప్రజలకు రాముడన్నా .. కృష్ణుడన్నా రామారావు గారే. వారు సాధించిన విజయాలను గురించి మాట్లాడడం కన్నా ఎక్కువగా మన మనస్సులో ఆలోచన చేస్తూ, వారు వేసిన దారుల్లో నడుస్తూ వారిని గుర్తుచేసుకున్నప్పుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ప్రతిరోజు సినిమాకు సెట్ కు వెళ్లిన ఒక ఆర్టిస్ట్ నాతో సహా.. ఈ పేరును గుర్తుతెచ్చుకోకుండా ఉండడు. తెలుగు సినిమాకి గుర్తింపును.. గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావుగారు. అలాంటి వ్యక్తి పనిచేసిన ఇండస్ట్రీలో మనం పనిచేస్తుండటం కంటే గర్వకారణం మరొకటి లేదు అని రామ్ చరణ్ మాట్లాడరు.
ఇక చిన్నతనంలో ఎన్టీఆర్ ని ఒక్కసారి కలిశానని రామ్ చరణ్ తెలిపారు. నేను, పురంధరరేశ్వరి గారి అబ్బాయి రితేష్ స్కేటింగ్ క్లాసులకు వెళ్లే వాళ్లం. ఉదయం ఐదున్నర, ఆరు గంటలకు క్లాసులు అయిపోయేవి. ఓ రోజు రితేష్ ‘మా తాతయ్య గారి ఇంటికి వెళదామా?’ అని అడిగాడు. అప్పుడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి. సీఎంకు పెద్ద సెక్యూరిటీ ఉంటుందని, అక్కడకు వెళ్లగలమా? లేదా? అనేది కూడా తెలియదు. నేను, రితేష్ స్కేటింగ్ చేసుకుంటూ… వాళ్ళ ఇంటి నుంచి కిందకు వెళితే రామారావు గారి ఇల్లు వచ్చింది. అప్పుడు సమయం ఉదయం ఆరున్నర గంటలు. ఎన్టీఆర్ గారిని కలిసి వెళ్లిపోదామనుకున్నా. అయితే, ఆయన అప్పటికే రెడీ అయిపోయి టిఫన్ చేయడానికి కూర్చున్నారు. అందరికీ తెలిసినట్లే చికెన్ పెట్టుకుని హెల్దీగా తింటున్నారు. నన్ను చూసి, నాకు కూడా టిఫిన్ పెట్టారు. అది నాకు కలిగిన అదృష్టం. ఆయనతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన ఆ క్షణాలను జీవితాంతం మరచిపోలేను” అని రామ్ చరణ్ వివరించారు.
ఇక ఇప్పుడు సౌత్ ఇండియా గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. కానీ, ఆ కాలంలోనే ఎన్టీఆర్ గారు.. మన పవర్ ఏంటో చూపించారు. ఇక అలాంటి వ్యక్తి గురించి నెక్స్ట్ జనరేషన్ కూడా తెలుసుకోవాలి. ఇలాంటి ఫంక్షన్ కు నన్ను పిలిచినందుకు నందమూరి కుటుంబానికి థాంక్స్. ఇక బాలయ్య బాబు గారు మా ఫంక్షన్స్ కు అన్నింటికి వస్తారు.. ఇక ఈ ఫంక్షన్ కు పిలిచిన బాలయ్య బాబు గారికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్తున్నాను అని చెప్పి.. జై ఎన్టీఆర్ అంటూ ముగించారు. దీంతో ఎన్టీఆర్ గురించి చాలా చక్కగా మాట్లాడినందుకు చరణ్ ని మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ తో పాటు నందమూరి ఫ్యాన్స్ అంతా కూడా తెగ పొగిడేస్తున్నారు.