Ram Charan Not Doing Any Movie With Dil Raju: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతికి విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో ఆడియన్స్ ఆదరణ కరువైంది. దీంతో మూవీకి వసూళ్లు రాలేదు. ఈ సినిమాతో నష్టపోయిన నిర్మాతల కోసం రామ్ చరణ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడని, వారితోనే మరో సినిమా చేస్తానని మాట ఇచ్చినట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ వార్తల్లో నిజం తాజాగా రామ్ చరణ్ టీం స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన కూడా ఇచ్చింది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు నిర్మించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 450 కోట్ల వ్యయంతో ఈ గేమ్ ఛేంజర్‌ని తెరకెక్కించినట్టు సమాచారం. అయితే రిలీజ్ తర్వాత మూవీ ఫలితం పట్ల చిత్ర బృందం మొత్తం అసంతృప్తితో ఉంది. దీంతో దిల్ రాజుతో తనకు ఉన్న అనుబంధంతో చరణ్ వారి బ్యానర్లోనే మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉన్నది నిజమే అయినప్పటికీ ఇప్పటి వరకు చరణ్ ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదని ఆయన టీం స్పష్టం చేసింది.
ఈ మేరకు ఓ ప్రకటన ఇచ్చింది. “కొన్ని రోజులుగా రామ్ చరణ్ దిల్ రాజు బ్యానర్లో మరో సినిమా చేస్తానని మాట ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అవి మా దృష్టికి వచ్చాయి. అందులో ఏమాత్రం నిజం లేదు. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 సినిమాతో బిజీ ఉన్నారు. ఆయన చేతిలో ప్రస్తుతం ఇదోక ప్రాజెక్ట్ మాత్రమే ఉంది” అని పేర్కొంది. బుచ్చిబాబుతో సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్‌తో ఓ సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలోనే ఆయన 17వ చిత్రం రానుందని ఇండస్ట్రీలో గట్టి ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సుకుమార్ చరణ్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.