Site icon Prime9

Pavala Shyamala : పవన్ కళ్యాణ్ నా కోసం అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చారు – పావలా శ్యామల

pavala-shyamala-shocking-comments-on-pawan-kalyan

pavala-shyamala-shocking-comments-on-pawan-kalyan

Pavala Shyamala : టాలీవుడ్ లో లేడీ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు నటి పావలా శ్యామల. నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఆమె దాదాపు 350కి పైగా సినిమాలో నటించి ఎన్నో ఉత్తమ నటి పురస్కారాలు సాధించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా.. ఎన్నో పాత్రలు పోషించిన ఆమె.. ముఖ్యంగా పని మనిషి క్యారెక్టర్ లతో ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. గోలీమార్, ఆంధ్రావాలా సినిమాల్లో పావలా శ్యామల చేసిన కామెడీ ఇప్పటికీ మీమ్స్ రూపంలో వస్తూనే ఉంటుంది. ఇక వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆమె ఆరోగ్యం కొంచెం కొంచెం క్షీణిస్తూ వస్తుంది. ఇక ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంది.

అయితే ఆర్థిక ఇబ్బందులు మాత్రం తప్పడంలేదని వాపోయింది. అయితే గతంలో పవన్ కళ్యాణ్.. పావలా శ్యామలకు ఆర్ధిక సాయం చేశారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై పావలా శ్యామల స్పందించారు. ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, పెద్దల పట్ల ఆయనకున్న గౌరవం గురించి చెప్పుకొచ్చింది. పవన్ తనకు ఒక లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చారని.. అంతకుమించి తనకోసం ఆయన పరిగెత్తుకుంటూరావడం చాలా గొప్ప విషయమని చెప్పింది. గబ్బర్ సింగ్ షూటింగ్ అనుకుంటా.. అప్పుడు నా ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఆర్థిక ఇబ్బందులు.. ఇండస్ట్రీలో ఒకరు ఇద్దరికీ చెప్తే.. పవన్ కళ్యాణ్ ఒకసారి కలవండి అని చెప్పారు. ఏదైనా చిన్న క్యారెక్టర్ ఇస్తారేమో అని అడగడానికి అక్కడకు వెళ్ళాను. నడవలేకపోతున్నాను.. వణికిపోతున్నా చలిలో.. నా కూతురితో పాటు వెళ్లి నిలబడ్డాను. అయితే లోపలికి పవన్ మేనేజర్ నన్ను వెళ్లనివ్వలేదు. చాలాసేపు బయట నిలబడ్డాను. ఆయన కోపంగా ఉన్నారు.. ఇప్పుడు వెళ్ళకండి.. బయటికి వచ్చాకా చూద్దామని చెప్పుకొచ్చారు. ఇక ఆయన క్యార్ వ్యాన్ ఎక్కే దగ్గర ఎదురుచూస్తున్నాను. అక్కడే బండ్ల గణేష్ కూడా ఉన్నాడు. మేమిద్దరం కలిసి మూడు సినిమాలు చేశాం.. ఇలా పవన్ ను కలవాలి అని అంటే.. ఆయన కూడా ఇప్పుడు కాదు.. ఆయన కోపంలో ఉన్నారు.. వెనక్కి వెళ్ళండి అని తోసేశాడు. ఇక నాకు కోపం వచ్చి.. వారిని తోసుకొని ముందుకు వెళ్లాను. అప్పటికే పవన్ .. జీప్ లో ఎక్కి వెళ్లిపోతున్నారు.

దాంతో ఇంకో అడుగు ముందుకేసి ముందుకు వెళ్లాను. ఆయన నన్ను చూసి జీప్ లో నుంచి అమాంతం దూకి.. పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి దండం పెట్టి.. ఏమ్మా .. మీరేంటి ఇక్కడ.. ఏమైంది.. అంతా ఓకేనా అని అడిగారు. లేదు బాబు.. ఆరోగ్యం సహకరించడం లేదు.. షూటింగ్ చేయలేకపోతున్నా.. ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇప్పిస్తారేమో అని అడుగుదామని వచ్చాను అని చెప్పాను. అంతే.. వెంటనే మేనేజర్ ను పిలిచి.. అమ్మకు రూ. 20 వేలు ఇచ్చి, కారు ఇచ్చి పంపించండి. రేపటిలోగా వారి ఇంటికి ఇంకో రూ. 80 వేలు పంపండి అని చెప్పారు. ఆయన నాకు ఇచ్చింది లక్ష రూపాయలు.. కానీ ఆ సమయంలో అది ఇవ్వడం చాలా గ్రేట్. అప్పుడు ఆయన రేణు దేశాయ్ తో గొడవల్లో ఉన్నాడు.. ఆర్థిక పరిస్థితి ఆయనదే బాగోలేదట.. అప్పుడు నాకు లక్ష ఇవ్వడం గ్రేట్ అన్ని అక్కడ ఉన్నవారు చెప్పుకొచ్చారు.

పవన్ నాకు లక్ష ఇవ్వడం కన్నా.. నాకోసం ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడినది.. ఎన్ని కోట్లు ఇచ్చిన దక్కని ఆనందం. నిజం చెప్పాలంటే మా ఇద్దరికీ అంత పరిచయం కూడా లేదు. సుస్వాగతం సినిమాలో ఒక చిన్న షాట్ లో కనిపిస్తాను.. అప్పుడు చూసిన ఆయన.. ఇన్నేళ్ళైనా నను గుర్తుపట్టి రావడం అనేది ఆయన గొప్పతనం” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version