K Vasu: తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ దర్శకుడు, రచయిత కె. వాసు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. సీనియర్ నటుడు శరత్ బాబు మరణ వార్తను మరువక ముందే పరిశ్రమలో మరో ఘటన జరగడంతో జరగడంతో విషాదం నెలకొంది.
తండ్రి బాటలోనే పరిశ్రమలోకి(K Vasu)
కాగా, సీనియర్ దర్శకుడు కె. ప్రత్యగాత్మ కుమారుడు కె. వాసు. కృష్ణాజిల్లా ముదునూరుకు చెందిన ఆయన తండ్రి బాటలోనే పరిశ్రమలోకి అడుగుపెట్టి, ప్రేక్షకులను అలరించేలా పలు చిత్రాలు తెరకెక్కించారు. కె. వాసు దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ‘ఆడపిల్లల తండ్రి’. కృష్ణంరాజు హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ‘ప్రాణం ఖరీదు’సినిమాతో చిరంజీవిని నటుడిగా పరిచయం చేసింది కె. వాసునే. ‘కోతల రాయుడు’, ‘సరదా రాముడు’, ‘పక్కింటి అమ్మాయి’, ‘కలహాల కాపురం’, ‘అల్లుళ్ళొస్తున్నారు’, ‘కొత్త దంపతులు’, ‘ఆడపిల్ల’, ‘పుట్టినిల్లా మెట్టినిల్లా’లాంటి చిత్రాలు వాసుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
వాసు దర్శకత్వం వహించిన ‘అయ్యప్పస్వామి మహత్యం’, ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ అందుకున్నాయి. 2008లో విడుదలైన ‘గజిబిజి’ సినిమా అనంతరం వాసు దర్శకత్వానికి దూరమయ్యారు .కె. వాసు మృతి విషయం తెలిసిన పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తూ.. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు